
16 శాటిలైట్లు అంతరిక్ష పతనం
నిర్ణీత స్థాయికి చేరలేని రాకెట్
లోపమే అపజయం కాదన్న ఛైర్మన్
కారణాల విశ్లేషణ తరువాతనే వివరాలు
శ్రీహరికోట : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు కొత్త సంవత్సర ఆరంభంలో అపజయం ఎదురైంది. సోమవారం ఇస్రోకు చెందిన విశ్వసనీయ రాకెట్ పిఎస్ఎల్వి సి 62 ప్రయోగదశలో గతి తప్పింది. అంతరిక్ష వాహకనౌకలో కీలకమైన లోపం తలెత్తిందని, కక్షలోకి 16 శాటిలైట్లను తీసుకువెళ్లే ప్రయోగం విఫలం అయిందని ఇస్రో వర్గాలు స్వయంగా ప్రకటించాయి. భూ వాతావరణ పరిశీలనకు ఉద్ధేశించిన విదేశీ ఉపగ్రహం అనుబంధంగా 15 శాటిలైట్లను ఈ రాకెట్ ద్వారా వేర్వేరు స్థాయిల్లో కక్షల్లోకి చేర్చాల్సి ఉంది. భారత రక్షణ రంగానికి అత్యవసరం అయిన అన్వేష్ (సాంకేతిక నామం ఇఒఎస్ఎన్ 1) కూడా శాటిలైట్ల శ్రేణిలో ఉన్నాయి. కౌంట్ డౌన్ ప్రక్రియ ముగిసిన తరువాత రాకెట్‌ను శాటిలైట్లతో ప్రయోగించారు. అయితే ఈ వాహక నౌక నిర్ణీత మార్గం నుంచి దారి తప్పింది. ముందుకు వెళ్లడానికి మొరాయించింది.
ఈ ప్రధాన సాంకేతిక లోపాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగవేదిక (షార్) లోని సైంటిస్టులు , సాంకేతిక సిబ్బంది గుర్తించారు. మిషన్ పిఎస్ఎల్వి ఈసారి వైఫల్యం చెందినట్లు ప్రకటించి, అపజయాన్ని అంగీకరించారు. జరిగిన పరిణామాన్ని విలేకరుల సమావేశంలో ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ తెలియచేశారు. మొదటి రెంప దశలు విజయవంతంగా ముగిశాయి. అయితే తరువాతి దశలో రాకెట్లో అవకతవకలు ఏర్పడ్డాయని వివరించారు. నిర్ణీత ఎత్తులోకి రాకెట్‌ను తీసుకువెళ్లడానికి అవసరంఅయిన విధంగా ఇంజన్ల జ్వలిత చర్య జరగలేదు. దీనితో రాకెట్ దారి తప్పింది. ఇది ఎందుకు జరిగిందనేది పూర్తి స్థాయిలో విశ్లేషించుకోవల్సి ఉంటుందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం పలు దేశాలకు చెందిన శాటిలైట్లను నిర్ణీత కక్షల్లోకి పంపించే కాంట్రాక్టు తీసుకుంది. ప్రస్తుత పరిణామంతో మొత్తం 16 శాటిలైట్లు స్పేస్‌లోనే పతనం చెందే పరిస్థితి ఏర్పడింది. మూడో స్టేజీలో పిఎస్ఎల్వి పరీక్షలలో వైఫల్యం తలెత్తడం ఇది వరుసగా రెండోసారి అయింది.
ఇంతకు ముందు గత ఏడాది మేలో తలపెట్టిన పిఎస్ఎల్వి సి 61 ఇఒఎస్ 09 కూడా సక్రమ మోటారు ఒత్తిడిని చేరుకోలేని స్థితిలో చతికిలపడింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎక్కడ లోపం తలెత్తింది? అనేది తెలుసుకోవడానికి ఇస్రోకు కొంత సమయం పడుతుందని ఇస్రో మాజీ అగ్రస్థాయి సైంటిస్టు ఒక్కరు తెలిపారు. డాటా ఇతర విషయాలను సేకరించుకోవల్సి ఉంటుంది. ఏ దశలో వైఫల్యం చెందిందనేది నిర్థారించుకోవల్సి ఉంటుందని ఈ సైంటిస్టు చెప్పారు. ఇది నిజంగానే ఇస్రోకు ఎదురుదెబ్బనే అని పేరు చెప్పడానికి ఇష్టపడని సైంటిస్టు తెలిపారు. శాటిలైట్లు అనుకున్న కక్షలోకి చేరుకోలేదు. దీనితో అన్ని కూడా ఇక అంతరిక్ష శకలాలుగా మారుతాయని చెప్పారు. సోమవారం ఉదయం అంతకు ముందటి 22 .5 గంటల కౌంట్‌డౌన్ ముగించుకున్న తరువాత 44.4 మీటర్ల నాలుగు స్టేజ్‌ల రాకెట్‌ను ఉదయం 10.18గంటలకు ప్రయోగానికి సిద్ధం చేశారు.
విదేశాలకు చెందిన శాటిలైట్లు కూడా ఈ మిషన్‌లో ఉండటంతో ఇస్రోకు ఇది అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు తీసుకురావల్సిన ప్రయోగం అయింది. ప్రధానమైన భూ పర్యవేక్షక శాటిలైట్‌ను ఇతర సహ శాటిలైట్లను 512 కిలోమీటర్ల దూరంలోని సన్ సింక్రోనస్ ఆర్బిట్ లోనికి ప్రయోగం తరువాత 17 నిమిషాలకు చేర్చాల్సి ఉంది. మొదటి రెండు స్టేజీల్లో అంతా సవ్యంగా జరిగింది.మూడవ దశ అత్యంత కీలకమైనది. ఈ దశలోనే పరిస్థితి చేయిదాటిందని ఇస్రో ఛైర్మన్ మీడియాకు తెలిపారు. ఇప్పటికిప్పుడు తమకు దక్కిన, నిర్థారణ అయిన సమాచారం మేరకు ప్రయోగం ముందుకు సాగలేదు. ఇంతకు మించి పూర్తి వివరాలు తరువాతనే తెలియచేయడం జరుగుతుందని చెప్పారు మూడో దశలోనే ఇంజిన్ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిని తాము ఇప్పుడు మరోసారి గుర్తించామని నారాయణన్ తెలిపారు. ఇప్పుడు విఫలం చెందాం. అయితే ఓటమి చెందలేదు. తలెత్తిన లోపంతో ఎదురైన వైఫల్యాన్ని తాము ఘాటైన పాఠంగా భావించుకుంటామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అన్ని సంబంధిత స్టేషన్ల నుంచి డాటా సమీకరించుకున్న తరువాతనే జరిగిన దానిపై స్పష్టతకు అవకాశం ఉంటుందని తెలిపి మీడియా సమావేశం ముగించారు.




