
న్యూఢిల్లీ ః అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) వెంబడి జమ్మూ కశ్మీర్‌లో ఆదివారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్లు గగనతలంలో సంచరించాయి. పాక్ వైపు నుంచి ఇవి క్రమేపీ పరిభ్రమిస్తూ భారతీయ గగనతలంలోకి ప్రవేశించడం, కొద్ది సేపు సరిహద్దుల్లోని కీలక భారతీయ స్థావరాలపై తిరిగి ఆ తరువాత వెనకకు వెళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనితో అంతర్జాతీయ సరిహద్దులో భారతీయ నిఘా, సైనిక వర్గాలు అప్రమత్తం అయ్యాయి. దాదాపుగా ఐదు అంతకు మించి డ్రోన్లు తిరిగినట్లు తేలింది. వీటిని గమనించగానే రాజౌరి నోవాషెరా సెక్టార్‌లో భారతీయ సైన్యం వాటిపై కాల్పులు జరిపింది. అయితే డ్రోన్లు దెబ్బతిన్నదీ లేనిది తెలియలేదు.
సాంబా, పూంచ్ జిల్లాల పరిధిలోనూ డ్రోన్లు గుర్తించారు. ఆకాశంలో ఎగురుతూ కన్పించిన డ్రోన్లు కశ్మీర్‌లోని అత్యంత కీలకమైన సరిహద్దు ప్రాంతంలోకి ఆయుధాలను లేదా ఇతరత్రా సామాగ్రిని జారవిడిచాయనే అనుమానాలు తలెత్తాయి. అయితే దీనిపై అధికారిక నిర్థారణ కాలేదు. డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ జమ్మూ కశ్మీర్‌లోని క్షేత్రస్థాయి ఉగ్రవాదులకు ఆయుధాలు ఇతర కీలక సమాచారం అందించడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కశ్మీర్‌లో తిరిగి ఏదైనా పాక్ ఆపరేషన్ ఉందా? అనే అనుమానాలు , ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జోరందుకున్నాయి. ఇక్కడ కన్పించిన డ్రోన్లను భారతీయ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని వార్తలు వెలువడ్డాయి.




