
నవీ ముంబై: మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో మాజీ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. శుక్రవారం డివై పాటిల్ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా జరిగిన ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరు మూడు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. 155 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఇన్నింగ్స్ చివరి బంతికి ఛేదించింది. నడైన్ డి క్లార్క్ అసాధారణ బ్యాటింగ్‌తో బెంగళూరుకు సంచలన విజయం సాధించి పెట్టింది. ఒక దశలో 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న బెంగళూరును క్లార్క్ ఆదుకుంది.
చిరస్మరణీయ బ్యాటింగ్‌ను కనబరిచిన క్లార్క్ 44 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 63 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అరుధంతి రెడ్డి (20) తనవంతు సహకారం అందించింది. మిగతా వారిలో ఓపెనర్లు గ్రేస్ హారిస్ (25), మంధాన (18) పరుగులు చేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ కమలిని, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టుకు అండగా నిలిచారు. కమలిని ఐదు ఫోర్లతో 32 పరుగులు సాధించింది. హర్మన్‌ప్రీత్ ఒక సిక్సర్, మరో ఫోర్‌తో 20 పరుగులు చేసింది. నికోల కారే, సజీవన్ సజనాలు విధ్వంసక బ్యాటింగ్‌తో ముంబైను ఆదుకున్నారు. దూకుడుగా ఆడిన కారే 29 బంతుల్లో 4 ఫోర్లతో 40 పరుగులు చేసింది. ఇక చెలరేగి ఆడిన సజనా 25 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది.




