
చత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ వెల్లడించారు. బుధవారం సుక్మా రిజర్వు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించిన విషయాన్ని వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల పునరావాసం కోసం పూనా మార్గం ప్రచారాన్ని విసృ్తతంగా చేస్తున్నాయి నేపథ్యంలో మావోయిస్టులకు ప్రభుత్వాలు కల్పిస్తున్న సౌకర్యాలకు ఆకర్షితులై జనజీవన స్రవంతిలో కలిసి సుఖవంతమైన జీవనం గడపాలనే ఉద్దేశంతో సౌత్ బస్తర్ డివిజన్, మార్ డివిజన్, పిఎల్‌జిఏ బెటాలియన్ కు చెందిన ఏడుగురు మహిళలతో సహా 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో పివైఫై సిఎం సభ్యులు ఒకరు, డివిసిఎం సభ్యుడు ఒకరు, పిపిసిఎం సభ్యులు ముగ్గురు, ఏసియన్ సభ్యులు ముగ్గురితో సహా 18 మంది పార్టీ సభ్యులు ఉన్నారు.
లొంగిపోయిన మావోయిస్టులు పలు సంఘటనలో ప్రధానంగా పాల్గొన్నారు. సుక్మా జిల్లా, మార్వార్ ప్రాంతం, ఒడిస్సా సరిహద్దుల్లోని అనేక సంఘటనలు ప్రధానంగా పాల్గొన్నారు. లొంగిపోయిన 26 మంది మావోయిస్టులపై 64 లక్షల రూపాయల రివార్డు ఉన్నాయి. మిగిలిన మావోయిస్టులు హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలిసి సుఖవంతమైన జీవనం గడపటానికి పోలీసుల ఎదుట లొంగిపోవాలని సూచించారు. ఈ సమావేశంలో డిఐజి కార్యాలయ రెండవ కమాండెంట్ ఆఫీసర్ సురేష్ సింగ్ పాయల్, సిఆర్‌పిఎఫ్ 212 బెటాలియన్ రెండవ కమాండ్ ఆఫీసర్ అజయ్ మణి త్రిపాఠి, సిఆర్‌పిఎఫ్ 217 బెటాలియన్ రెండవ కమాండ్ ఆఫీసర్ వీరేంద్ర సింగ్, నక్సల్స్ ఆఫ్ అదనపు సూపరింటెండెంట్ రోహిత్ షా, అడిషనల్ సూపరింటెండెంట్ అభిషేక్ వర్మ, డిప్యూటీ సూపరింటెండెంట్‌లు మనీష్ రాత్రే, మౌనిక శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.




