
ఖమ్మం జిల్లాలో బుధవారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఫొటోలు, ఆ పార్టీకి చెందిన వైసిపి జెండాలు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు జై జగన్.. జై కెటిఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుకల్లో కెసిఆర్, కెటిఆర్ ఫొటోలు కనిపించడంతో రెండు పార్టీల సాన్నిహిత్యం మరోసారి చర్చనీయాంశమైంది. కెటిఆర్ పర్యటనలో జై జగన్ అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కూసుమంచి మండలం, నాయకన్‌గూడెం వద్ద పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎం వైఎస్ జగన్ ఫొటోతో పాటు వైసిపి జెండాలు దర్శనమివ్వడం కలకలం రేపింది. కెటిఆర్ ర్యాలీలో వైసిపి కార్యకర్తలు, వైఎస్ జగన్ అభిమానులు పాల్గొన్నారు. వారంతా వైసిపి జెండాలు చేతబట్టి…జై జగన్… జై కెటిఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ పర్యటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా, ఖమ్మం పర్యటనలో భాగంగా నాయకన్‌గూడెం గ్రామానికి చేరుకున్న కెటిఆర్‌కు బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకన్‌గూడెం నుంచి పాలేరు, కూసుమంచి మీదుగా కెటిఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. కార్యకర్తలు, నాయకులు ఖమ్మం వరకు బైక్‌లపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ తరఫున విజయం సాధించిన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్‌లను కలిసి వారిని కెటిఆర్ అభినందించారు. నాయకన్ గూడెం వద్ద స్వాగతం పలికిన వారిలో మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, జిల్లా నాయకులు ఇంటూరి శేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ పాషా, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




