
త్రిసూర్ : కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.ఆదివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంతో పార్కింగ్ ఏరియాలో ఉన్న 500 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో పెయిడ్ పార్కింగ్ షెడ్‌లో సుమారు 600కు పైగా మోటార్ సైకిళ్లు ఉన్నట్టు సమాచారం. విద్యుత్ తీగ బైక్‌పై తెగి పడడంతో ప్రమాదం చెలరేగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. తొలుత రెండు మోటార్ సైకిళ్లలో ఈ మంటలు చెలరేగి ఆ తర్వాత వేగంగా పార్కింగ్ ప్రాంతమంతా వ్యాపించాయి.
ఈ ఘటనలో పార్కింగ్ ప్లేస్‌లో ఉన్న సుమారు 500కి పైగా బైకులు కాలి బూడిదైనట్టు సమాచారం. ఈ ఘటనలో పార్కింగ్ షెడ్ సహా రైల్వే స్టేషన్ రెండో గేటు వద్దనున్న టికెట్ కౌంటర్, ఆగి ఉన్న ఓ తనిఖీ వాహనం దగ్ధమయ్యాయి. అక్కడి వారు వెంటనే అప్రమత్తమై పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.




