
ప్రాజెక్టులపై అవినీతి బండారం బయట పడుతుందనే భయంతోనే బిఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేదని మంత్రి జూపల్లి కృష్ణా రావు మండిపడ్డారు. శనివారం అసెంబ్లీలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కృష్ణా నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా జరిగిన చర్చలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కృష్ణా నదీ జలాల పంపకాల సమయంలో రాష్ట్రానికి 299 టిఎంసిల నీటికే ఎందుకు అంగీకరించారని, ఆదరబాదరగా ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. ఎనిమిది లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పుల కుప్ప గా మార్చారని ఆయన కెసిఆర్‌నుద్ధేశించి విమర్శించారు. బిఆర్‌ఎస్‌కు నీళ్ళ కంటే నిధులపైనే మక్కువ ఎక్కువ అని విమర్శించారు.
ఇల్లు చక్కబెట్ట లేనోడు: మంత్రి పొంగులేటి ఫైర్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగిస్తూ పోతిరెడ్డిపాడు లో 11 వేల క్యూసెక్కులను 42 వేల క్యూసెక్కులు కు, మళ్లీ వీటిని 92 వేల క్యూసెక్కులాగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పక్క రాష్ట్ర నీళ్లను దోచుకున్నదని ఆరోపించారు. ఈ విషయం పది సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి తెలుసునని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జూరాల కింద ఇచ్చిన 70 టీఎంసీలకి స్పష్టం గా కేటాయింపులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఆ 70 టీఎంసీల నీళ్లను సజావుగా మీరు వినియోగించుకొని ఉంటే, హైట్ వేరియేషన్ కలిసి వచ్చేది, 22 రోజులు 37 లిఫ్టుల ఖర్చు కలిసి వచ్చేది, ప్రతి సంవత్సరం కరెంటుకి అయ్యే ఖర్చు కలిసి వచ్చేదని, ఆయకట్టు కలిసి వచ్చేదని ఆయన వివరించారు. స్వార్థం, స్వలాభం, సొంత ఆస్తులను పెంచుకోవడానికి జూరాల నుంచి నీళ్లు తీసుకోకుం డా శ్రీశైలం నుంచి తీసుకుని పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు అన్యాయం చేశారని ఆయన తెలిపారు.
సర్కార్ మారినా కాంట్రాక్టర్లు వారే: అక్బరుద్దీన్
మజ్లీస్ పక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తూ ప్రభుత్వం మారినా కాంట్రాక్టర్లు పాతవారే కొనసాగుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి నీటి పారుదల ప్రాజెక్టులు ఏటిఎంలుగా మారాయని అక్బర్ విమర్శించారు.
కెసిఆర్ వస్తే హుందాగా ఉండేది: కూనంనేని
సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కెసిఆర్ సభకు వస్తే హుంధాగా ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల విషయంలో ఒక్క తప్పు కూడా జరగలేదని ఆయన అనడంతో పాలక పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.
కెసిఆర్‌కు భారత రత్న ఇవ్వాలి : శంకర్
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పచ్చి అబద్దాలు, మోసాలు చేసిన కెసిఆర్‌కు భారతరత్న అవా ర్డు ఇవ్వాలని అన్నారు. బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రసంగిస్తూ పవర్ పాయింట్ ప్రజంటేషన్లతో నీరు స్క్రీన్ల (తెర)పై పారుతున్నాయే తప్ప వ్యవసాయానికి అందడం లేదని విమర్శంచారు.
బిజెపి వాకౌట్
సిఎం సమాధానం చెప్పడానికి తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బిజెపి నాయకుడు ఏలేటి కోరారు. స్పీకర్ నిరాకరించడంతో బిజెపి వాకౌట్ చేసింది.




