
దేశవ్యాప్తంగా గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం నాలుగు ముసాయుదా నిబంధనలను విడుదల చేసింది. దీంతో డెలివరీ బాయ్‌లు, క్యాబ్ డ్రైవర్లకు కనీస వేతనం, ఆరోగ్య బీమా, వృత్తిపరమైన భద్రతా చర్యలు, సామాజిక భద్రతా కవర్ వంటి సౌకర్యాలు త్వరలో అందనున్నాయి. వేతనం, పని పరిస్థితులు, సామాజిక భద్రత కోసం దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 కింద కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా నియమాలను నోటిఫై చేసింది.
ఒక సంస్థ వద్ద సంవత్సరంలో కనీసం 90 రోజులు పని చేసిన గిగ్ కార్మికులు అర్హులు అవుతారు. ఆధార్‌తో ప్రభుత్వ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నమోదు అనంతరం డిజిటల్ ఐడి కార్డు, యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఇస్తారు. కంపెనీల విరాళాలతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. ఈ ముసాయిదాపై అభిప్రాయాలు కోరారు. అభిప్రాయాలను పరిశీలించి నిబంధనలు ఖరారు చేసిన తర్వాత అమలు చేయనున్నారు. జాతీయ సామాజిక భద్రతా బోర్డులో గిగ్ కార్మికుల ప్రతినిధులకు స్థానం కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది.
గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లు ప్రయోజనాలివే..
మొదటిసారిగా గిగ్ వర్కర్లను అధికారికంగా గుర్తించారు.
వర్కర్లకు భద్రత, మద్దతుగా సామాజిక భద్రత నిధి ఏర్పాటు
బీమా, ఆరోగ్య, ప్రసూతి, వృద్ధాప్య ప్రయోజనాల కోసం నిబంధనలు
అన్ని రాష్ట్రాల్లో ప్రయోజనాలను అందించేందుకు ఆధార్ ఆధారిత యూనివర్సల్ అకౌంట్ నంబర్




