
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి. హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హరీష్‌రావును చూస్తుంటే గోబెల్స్‌ను కూడా మించిపోయారని ఆయన ఎద్దెవా చేశారు. హరీష్ ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఒక్కటి కూడా వాస్తవం లేదని, అన్నీ పచ్చి అబద్దాలేనని ఆయన దుయ్యబట్టారు. సోమవారం అసెంబ్లీలో తన ఛాంబర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డికి అన్యాయం చేసిన వారే ఇప్పుడు మాట్లాడడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. హరీశ్‌రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇరిగేషన్‌లో తానే మాస్టర్‌నని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. హరీశ్‌రావుకు అంత అహంకారం ఎందుకు? అని మంత్రి ప్రశ్నించారు.ఎవరి హయాంలో ఏం జరిగిందో సాక్షాధారాలతో సహా సభలో బయటపెడతానని అన్నారు. కృష్ణా జలాల్లో తాము 90టీఎంసీలు డిమాండ్ చేయగా, తాము 45 టీఎంసీలు మాత్రమే అడిగామని హరీశ్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అబద్ధాల పునాదులపై బిఆర్‌ఎస్ ఇంకా ఎంత కాలం రాజకీయం చేస్తుందని ఆయన ప్రశ్నించారు.ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ.. అదే నిజం అవుతుందనుకుంటున్నారని మండిడ్డారు. సీడబ్ల్యూకి రాసిన లేఖను కూడా వక్రీకరిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి తాము ఎందుకు అన్యాయం చేసేలా లేఖ రాస్తానని ప్రశ్నించారు. సీడబ్ల్యూకి రాసిన లేఖను మొత్తంగా కాకుండా కొంత భాగాన్నే చూపిస్తూ బురద చల్లుతున్నారని.. కృష్ణా బేసిన్‌పై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌కు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో వారి చేతకానితనాన్ని తమపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై నిజంగా వారికి ప్రేమే ఉంటే డీపీఆర్‌ను కేంద్రానికి పంపడానికి ఏడేళ్ల సమయం ఎందుకు పట్టిందని ఆయన నిలదీశారు. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు..అన్యాయం చేస్తున్నామంటూ ప్రతిపక్ష పార్టీ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, వాస్తవాలు ఏమిటో సభ ముందు ఉంచబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.




