
మనతెలంగాణ/హైదరాబాద్ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్ 2025(యుజిసి నెట్) పరీక్షలు బుధవారం(డిసెంబర్ 31) నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 7 వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో యుజిసి నెట్ పరీక్ష జరుగనున్నది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) మొత్తం 85 సబ్జెక్టులకు యుజిసి నెట్ నిర్వహించనున్నది.
గత అక్టోబర్ 7 నుంచి నవంబర్ 7 వరకు ఆన్‌లైన్‌లో యుజిసి నెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంటారు. యుజిసి నెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు… 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు… 200 మార్కులు కేటాయిస్తారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. లాంగ్వేజెస్ మినహా ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.




