
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎసీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేసారు. భారత దేశ ప్రజల కోసం ఒక శక్తిగా 140 సంవత్సరాల క్రితం ఇదే రోజున కాంగ్రెస్ ఆవిర్భవించిందని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించడం నుంచి రాజ్యాంగ నిర్మాణం వరకు, ప్రజాస్వామ్య సంస్థలను ఏర్పాటు చేయడం నుంచి విభిన్న దేశాన్ని ఏకం చేయడం వరకు ఆధునిక భారతదేశంలోని ప్రతి కీలక అధ్యాయాన్ని జాతీయ కాంగ్రెస్ తీర్చిదిద్దిందని కొనియాడారు.
జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనేది భారత ప్రజాస్వామ్య ప్రస్థానానికి ప్రతిరూపమని సీఎం రేవంత్ అన్నారు. సోనియా గాంధీ నాయకత్వాన్ని స్మరించుకుంటే సేవ, నిబద్ధత, నీతి, విలువలు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలోనే తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన పీవీ నరసింహారావు దేశ ప్రధానమంత్రిగా ఎదిగారని అన్నారు. అలాగే డాక్టర్ మన్మోహన్ సింగ్ వంటి గొప్ప ఆర్థికవేత్తకు ప్రధానమంత్రి పదవి దక్కేలా సోనియా గాంధీ చేసిన నిర్ణయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు.




