
మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిజెపి పెత్తందారు పార్టీ అని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షునిగా మోతే రోహిత్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ మోడీ, అమీత్ షా తమ పదవులు కాపాడుకోవడానికి ఎంత వరకైనా వెళతారని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని క్రమేణా తొలగించాలని ఉద్దేశ్యంతో నిధుల్లో కేంద్ర వాటా, రాష్ట్ర వాటా అనే నియమాన్ని పెట్టిందన్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాన్ని తీసుకుని వచ్చిందని, అప్పుడు రాష్ట్ర వాటా ఏమీ లేదని, మొత్తం కేంద్రమే భరించిందని ఆయన గుర్తు చేశారు. పెత్తందారు పార్టీ అయిన బిజెపి పేదలను దోచి ఆదాని, అంబానీలకు కట్టబెడుతున్నదని దుయ్యబట్టారు. పేద వారి గోడు గురించి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీగా గుర్తింపు పొందిందని, అటువంటి పార్టీలో మనం ఉండడం గర్వకారణమని అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజన్ ద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతున్నదని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణన చేయించారని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ్ర పతి ఒక్క కార్యకర్త శ్రమించాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.




