Friday, January 16, 2026
Google search engine
HomeUncategorizedఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు..

ఫ్యూచర్ సిటీ ప్రధాన రోడ్డుకు రతన్ టాటా పేరు..

 హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్

 అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు

 సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన

 కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాయనున్న ప్రభుత్వం

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేపధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన హైదరాబాద్ కు మరింతగా గ్లోబల్ మ్యాప్ లో చోటు కల్పించేలా సీఎం సంకల్పించారు. అందుకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను హైదరాబాద్ లో ప్రధాన రహదారులకు పెట్టాలని నిర్ణయించారు. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాలను నుంచి ప్రారంభమై ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అనుసంధానం చేసే 100 మీటర్ల గ్రీన్‌ఫీల్ రేడియల్ రోడ్డుకు పద్మభూషణ్ రతన్ టాటా పేరు పెట్టాలని నిర్ణయించింది. రావిర్యాల ఇంటర్‌చేంజ్‌కు ఇప్పటికే టాటా ఇంటర్‌చేంజ్ అని పేరు పెట్టారు.

యూఎస్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ ఎవెన్యూగా నామకరణం:

అలాగే ప్రపంచంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ముందు నుంచే వెళ్లే ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ పేరుతో డొనాల్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నిర్ణయంపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు, అమెరికా రాయబార కార్యాలయానికి ప్రభుత్వం లేఖ రాయనుంది.

ప్రధాన రహదారులకు గ్లోబల్ దిగ్గజ కంపెనీల పేర్లు:

ఢిల్లీలో ఇటీవల జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరమ్ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రకారం హైదరాబాద్‌లోని ముఖ్య రహదారులకు ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల పేర్లు పెట్టాలన్న దృష్టిలో భాగంగా మరిన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సేవలను గుర్తిస్తూ ఒక ముఖ్య రహదారిని గూగుల్ స్ట్రీట్ అని ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావితవ్యక్తులు, ప్రముఖ కంపెనీల పేర్లను రహదారులకు పెట్టడం ద్వారా వారికి సముచిత గౌరవం ఇవ్వటంతో పాటు, హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని సీఎం భావిస్తున్నారు. అలాగే ఆ రోడ్లపై ప్రయాణించివారికి కూడా స్ఫూర్తిమంతంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదన చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments