
పదవీచ్యుత, ప్రవాస బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు దేశంలోని ప్రత్యేక న్యాయస్థానం 21 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో అవినీతి సంబంధిత మూడు కేసులలో ఆమెకు ఈ శిక్ష విధించారు. ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానం 5 న్యాయమూర్తి మెహమ్మద్ అబ్దుల్లా ల్ మమూన్ గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. మూడు కేసులకు కలిపి ఇప్పుడు ఈ 78 సంవత్సరాల నాయకురాలు, ఇప్పుడు భారత్‌లో తలదాచుకుంటున్న హసీనా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కేసుల విచారణ ఆమె గైర్హాజరీ క్రమంలోనే వెలువడింది. ఇప్పటికే బంగ్లాదేశ్ లోని ట్రిబ్యునల్ హసీనాకు మరణశిక్ష విధించింది. దీనిని అమలుచేస్తామని ప్రకటించింది.
ఈ మూడు కేసులలో హసీనాకు కేసుకు ఒక్క లక్ష టాకాల జరిమానా విధించింది. ఈ మొత్తం కట్టకపోతే అదనంగా 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇక హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్‌కు , కూతురు సైమా వాజిద్ పుతుల్‌కు ఒక్కొక్కరికి ఐదు సంవత్సరాల జైలు శిక్షల తీర్పు వెలువరించారు. రాజధాని ఢాకా సమీపంలో హౌసింగ్ ప్రాజెక్టు భూముల కేటాయింపులో ఆమె తమ అధికార దుర్వినియోగం తారాస్థాయికి చేరిందనే అభియోగాలతో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులు ఈ విచారణలు, ఈ తీర్పులు అన్ని కూడా తనపై కక్షపూరితం, రాజకీయ దురుద్ధేశపూరితం అని హసీనా కొట్టిపారేశారు.




