
రైతులు చస్తే గాని భూ సమస్యలు పరిష్కరించరా… అయితే నా చావుతో నైనా మా భూ సమస్య పరిష్కారం కావాలని సూసైడ్ నోటు రాసుకొని ఒక యువకుడు వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజా అహమ్మద్ పల్లి గ్రామానికి చెందిన వడ్డె శ్రీనివాస్ కుటుంబానికి గ్రామ శివారులో 331 సర్వే నంబరులో 9 ఎకరాల 26 గుంటల భూమి ఉంది. అయితే అందులో 6 ఎకరాల భూమిని వారి పెద్దలు ఇతరులకు విక్రయించారు. కాగా మిగిలిన మూడు ఎకరాల 26 గుంటల భూమి మిగిలి ఉంది. ఆ భూమి మొత్తం తమ ప్రస్తుతం 7 మంది కుటంబ సభ్యులకు పట్టా రికార్డు ఉంది. భూమి రికార్డులకు మాత్రమే ఉంది. కాని ఖాస్తులో మాత్రం వారు లేరు. ఈ విషయాన్ని వారు గమనించి తమ పొలాన్ని సర్వే చేయించారు. మండల సర్వేయర్, ఆర్డీఓ సర్వేయర్, జిల్లా సర్వేయర్‌తో సర్వే చేయించారు. తమకు న్యాయంగా రావాల్సిన పొలం రిజర్వు ఫారెస్టులో జమ ఉన్నట్లు సర్వేయర్లు రిపోర్టు ఇచ్చారని బాదితులు తెలిపారు. కాని అటవీశాఖ అధికారులు మాత్రం తాము ఎప్పుడు కలిసినా తమ భూమి తమకు అప్పజెప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము అన్ని రకాల సర్వేలు నిర్వహింప జేశామని, సమస్య పరిష్కరించాలని తహసీల్దార్,
ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు ఎన్నో సార్లు విన్నవించినా అధికారులు మాత్రం స్పందించడం లేదన్నారు. చాలా సార్లు కలెక్టర్ కొడంగల్ అటవీశాఖ రేంజర్ అధికారిణి సవితకు సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినా అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 3 సంవత్సరాలుగా తాము ఈ భూ సమస్యపై సంబంధిత అధికారులతో ఎన్ని సార్లు విన్నవించినా లాభం లేదని, ఇక తమ సమస్య పరిష్కారానికి చావే శరణ్యమని వారు వాపోయారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కాగా కలెక్టర్ కార్యాలయం దగ్గర శ్రీనివాస్ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న సందర్భంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అతను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడి పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమస్యకు పరిష్కారం కొరకు ఉన్నతాధికారులను సంప్రదించాలని ఆత్మహత్య చావుకు పరిష్కారం కాదని కౌన్సిలింగ్ నిర్వహించి వదిలిపెట్టారు.




