
సిఎం రేవంత్ రెడ్డి ఓట్ల రాజకీయాలు తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నవంబర్ 29, 2009 చరిత్ర మలుపు తిప్పిన చారిత్రాత్మక రోజు అని అన్నారు. ఆనాడు కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎక్కడిది, రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిదని అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే సిద్దిపేట జిల్లా అయిందని సిద్దిపేట కు గోదావరి జలాలు వచ్చాయని సిద్దిపేటకు రైలు, మెడికల్ కాలేజీ వచ్చాయన్నారు. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని అన్నారు. ఆనాడు కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నాడు మనం కూడా సిద్దిపేటలో పాత బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మొత్తం 1531 రోజులు దీక్ష శిబిరం నడిచిందన్నారు.
కొన్ని వేల మంది దీక్షా శిబిరంలో పాల్గొన్నారని ప్రతి ఒక్క ఉద్యమకారుడు వచ్చారన్నారు. ఆ శిబిరానికి గుర్తు గా చిహ్నంగా ఒక పైలాన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రతిపాదన పెడుతున్నానని నవంబర్ 29 న పొద్దునే ఉద్యమంలో అని మీ ఉద్యమ జ్ఞాపకాలను ట్విట్టర్ లో గానీ సోషల్ మీడియాలో గానీ, ఇన్స్టగ్రాం లో కానీ మీ సోషల్ మీడియా అకౌంట్ లలో డిసెంబర్ 9 వరకు రోజు ఒకటి పోస్ట్ చేయాలన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పది ఏండ్లు పాలించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడన్నారు. ప్రాణాన్ని పణంగా పెట్ట్టి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కెసిఆర్ అని అలాంటి నాయకుడు కలలో కూడా తెలంగాణను మోసం చేశాడా అని అన్నారు. కొన్ని దశాబ్దాల కలను, కోట్ల మంది కలను కేసీఆర్ నిజం చేశాడన్నారు. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి రేవంత్ గద్దెనెక్కిండని అన్నారు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్రం మీద ప్రజల మీద శ్రద్ధ లేదన్నారు.
42 శాతం రిజర్వేషన్లు అని బీసీలను మోసం చేశారని రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్‌కు, ఈ కాంగ్రెస్ నాయకులకు పోలిక లేదని అన్నారు. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తారు మరి మలన్నసాగర్ లో కొండపోచమ్మలో నీళ్ళెక్కడివని ఎక్కడ కాలువలు తవ్వి నీళ్ళు ఇస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని ఆ పని ఆపేశారన్నారు. అలాంటి రాజకీయాల కోసం చూసే కాంగ్రెస్ నాయకులకు మనకు పొంతన లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




