
తన సోదరుడి జాడ చెప్పాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరిలు ముగ్గురు డిమాండ్ చేశారు. రావల్పిండి జైలులో ఖైదీ అయిన తమ సోదరుడిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని అధికారులను కోరారు. నెలరోజులుగా ఇమ్రాన్‌ను జైలులో ఎవరూ చూడటానికి వీల్లేకుండా అధికారులు ఆంక్షలు విధించారు. మరో వైపు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, చనిపోయాడని, దీనిని రహస్యంగా ఉంచుతున్నారని వార్తలు వెలువడుతున్నాయి. ఆయన ఎక్కడున్నాడు? ఏమైంది? అనేది తమకు తీవ్ర మానసిక ఆందోళన కల్గిస్తోందని ముగ్గురు సోదరిలు నూరెన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా తెలిపారు. తాము ఇటీవల రావల్పిండిలోని అడియాలా జైలు వద్దకు పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పిటిఐ) కార్యకర్తలతో కలిసి వెళ్లామని, ఆయనను కలిసేందుకు అనుమతి అడిగామని, అయితే ఈ దశలో తమపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. రావల్పిండి జైలులో 2023 నుంచి ఖాన్ నిర్బంధంలో ఉన్నాడు. మూడు వారాలుగా ఆయన పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదని ఇమ్రాన్ సోదరిలు వాపోయారు.




