
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వం దోచుకొని తనను తప్పుగా చిత్రీకరిస్తూ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా, కాసిపేటలో చోటుచేసుకుంది. కాసిపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని సోమగూడెం భారత్ కాలనీలో నివాసం ఉంటున్న సింగరేణి కార్మికుడు ఎస్కె సలీం ఇంటి ముందు చొప్పరిపల్లె గ్రామానికి చెందిన ఎస్.అనూష బుధవారం ఉదయం బైఠాయించింది. ఆమెకు అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాళ్లు మద్దతుగా బైఠాయించారు. ఈ సందర్భంగా ఆ యువతి మాట్లాడుతూ.. సలీం తనను ప్రేమిస్తున్నానని వెంటపడడ్డాడని, తాను ఒప్పుకోని పరిస్థితిలో అతని తల్లిని కూడా తన ఇంటికి రప్పించి, తన తల్లిని ఒప్పించాడని తెలిపింది. చనిపోతానని బెదిరించడంతో తాను సలీంను కూడా ప్రేమించానని, 8 సంవత్సరాలుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిపింది. ప్రేమ పేరుతో సర్వం దోచుకొని తనను అందరి మధ్య తప్పుడుగా చిత్రీకరిస్తూ మరో పెళ్లికి సలీం సిద్ధమయ్యాడని ఆరోపించింది.
గతంలో కూడా తన పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో సలీంపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానని తెలిపింది. సలీం నెల రోజులకు పైగా జైలుకు వెళ్ల్లివచ్చాడని, ఆయినప్పటికీ అతనిలో మార్పు రాలేదని, తనతోనే ఉంటూనే, తాను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు ఫోన్లో స్టేటస్‌లో పెట్టి మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాపోయింది. సలీంతో తనకు వివాహం జరిపించి న్యాయం చేయాలని కోరింది. సలీం ఇంటి ముందు బైఠాయించడంతో సలీం కుటుంబీకులు ఘర్షణకు దిగడంతో పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. ఎఎస్ఐ బూర రవీందర్ సంఘటన స్థలానికి చేరుకొని అనూషకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సలీం ను మందమర్రి సిఐ వద్దకు పిలిపించామని, సమస్యను అక్కడ పరిష్కరించుకోవాలని ఆయన సూచించడంతో మహిళా సంఘాలు అనూష ను తీసుకొని సిఐ శశిధర్‌రెడ్డి వద్దకు తీసుకొని వెళ్లారు.
ఈ సందర్భంగా సిఐ వారిద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇప్పటికే ఈ విషయం కోర్టులో నడుస్తోందని, ఇలా ఇంటి ముందు బైఠాయించడం సరికాదని, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మధ్యవర్తుల సహాయంతో సమస్యను పరిష్కారం చేసుకోవాలని, కోర్టు తీర్పు వరకు వేచిచూడాలని సిఐ వారికి సూచించారు. ఈ విషయంలో ఎవరు కూడా గొడవలకు వెళ్లవద్దని హితవు పలికారు. కాగా, బాధితురాలు అనూషకు మద్దతుగా మంచిర్యాల అంబేద్కర్ మహిళా సంఘం నాయకురాలు మద్దెల భవాని, కామెర అనూష సభ్యులు మద్దతు పలికారు.




