
ఐఎఎస్, ఐపిఎస్,ఎన్‌ఐఏ అధికారినంటూ పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి బాడీగార్డులుగా పనిచేసిన ఇద్దరు పరారీలో ఉన్నారు. రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌జోన్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ తన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరలోని షేక్‌పేటకు చెందిన బత్తిని శశికాంత్(39) అమాయకులకు తాను ఐఎఎస్, ఐపిఎస్ ఆఫీసర్ నంటూ నమ్మిస్తూ మోసాలు చేస్తున్నాడు. అతడికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన ప్రవీణ్, విమల్ బాడీగార్డులుగా పనిచేస్తున్నారు. నిందితుడు కొందరికి డిప్యూటీ కమిషనర్ మైన్స్‌గా పనిచేస్తున్నట్లు,
ఎన్‌ఐఏ అధికారి నంటూ చెప్పి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడు. నకిలీ ఐఏఎస్,ఐపిఎస్, ఎన్‌ఐఏ ఐడికార్డులను తయారు చేయించుకున్నాడు. తనతోపాటు ఇద్దరు బాడీగార్డులు, కారుకు సైరన్ పెట్టుకుని తిరుగుతుండడంతో పలువురు నిజంగానే ఆఫీసర్ అని భావించారు. కమ్యూనికేషన్ కోసం రెండు వాకీటాకీలను కూడా వాడేవారు. టిఎస్‌ఐఐసిలో ఇండస్ట్రీయల్ భూమి ఇప్పిస్తానని చెప్పి పలువురి వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే గోల్డ్ జిమ్ యజమాని అలీ హసన్ వద్ద రూ.10,50,665 వసూలు చేశాడు. తర్వాత నుంచి కన్పించకుండా పోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.




