
న్యూఢిల్లీ: T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళవారం ఐసిసి అధికారికంగా ప్రపంచకప్ షెడ్యూల్ ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వ తేదీ వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. మొత్తం ఎనిమిది వేదికలపై ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత్ లో ఐదు వేదికలు… ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ముంబైలోని వాంఖడే స్టేడియం, చెన్నైలోని MA చిదంబరం స్టేడియం, శ్రీలంకలోని మూడు వేదికలు.. కొలంబోలోని R ప్రేమదాస స్టేడియం, సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, కాండీలోని పల్లెకే స్టేడియం ఈ గ్లోబల్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇస్తాయి.
కాగా, టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కో గ్రూపులో ఐదు టీమ్‌లు ఉంటాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2 టీమ్‌లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఇలా మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. అహ్మదాబాద్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఒకవేళ ఫైనల్ కు పాక్ జట్టు వస్తే.. వేదిక శ్రీలంకకు మారుతుంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా దాయాది దేశాలు భారత్, పాక్ మ్యాచ్ జరగనుంది.




