
తెలంగాణలో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 11న తొలి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. నవంబర్ 27 నుండి మొదటి విడత నామినేషన్ ప్రారంభం కానుంది. అలాగే, నవంబర్ 30 నుండి రెండవ విడత నామినేషన్.. డిసెంబర్ 3 నుండి మూడవ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కాగా, ఈ మూడు విడతల్లో మొత్తం 12,760 పంచాయతీలు.. లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.




