
సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బిసిలకు తీరని అన్యాయం
బిసిలతో చర్చించిన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలి
బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్: త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి శాస్త్రీయత లేకుండా అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు రిజర్వేషన్లు కేటాయించారని బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అధికారులు చేసిన తప్పిదాలకు బిసిలకు గతం కంటే ప్రస్తుతం జరగబోయే నష్టం ఎక్కువ అని ఆయనన్నారు. 42 శాతం రిజర్వేషన్లు కాదు కదా ఇప్పుడు ఉన్న బిసి రిజర్వేషన్ల కే రాష్ట్ర ప్రభుత్వం గండికోడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిసి రిజర్వేషన్లు అతి తక్కువ కేటాయించి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిసిలకు 18 శాతం నుండి 22 శాతం వరకు బిసి రిజర్వేషన్లు అమలు జరిగితే ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో 16 శాతం నుండి 20 శాతం వరకే రిజర్వేషన్ల ను కేటాయించారని, అనేక డివిజన్లలో మండలాలలో బిసిలకు ఒక్కటి కూడా సర్పంచ్ సీటు రిజర్వు కాలేదని, మండలాల వారీగా చూస్తే ఒక మండలంలో గత ఎన్నికలలో కంటే కనీసం రెండు మూడు గ్రామాల బిసి కోటను తగ్గించారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో బిసి రిజర్వేషన్ కోటాను తగ్గించి జనరల్ కోట ను పెంచారన్నారు. దీనిని బట్టి బిసిలకు రావలసిన సర్పంచ్ స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టాలని కుట్ర ఇందులో దాగి ఉందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అన్ని వివరాలను సేకరించి అతి త్వరలోనే సి ఎస్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని, ఆయన న్యాయం చేయకుంటే కోర్టుల ద్వారా పోరాటం చేస్తామని జాజుల హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బిసి మంత్రులు, ప్రజాప్రతినిధులు బిసిలకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. 25న మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం, 30న చలో హైదరాబాద్, డిసెంబర్ 8 న చలో ఢిల్లీ కార్యక్రమాలను నిర్వహించి బిసి ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.




