
బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎంఎల్‌ఏ దానం నాగేందర్ తనకు సమాధానం చెప్పేందుకు మరి కొంత గడువు కావాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. పార్టీ ఫిరాయించిన దానంతో సహా మొత్తం పది మంది ఎంఎల్‌ఏలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్ ఇదివరకే స్పీకర్‌ను కోరిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ పంపించిన నోటీసులకు ఎనిమిది మంది స్పందించి కౌంటర్ దాఖలు చేయగా, ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కౌంటర్ దాఖలు చేయలేదు. తాము న్యాయ నిపుణులతో సంప్రదించి సమాధానం ఇస్తామని గత నెలలో స్పీకర్‌కు చెప్పినా, ఇంత వరకూ సమాధానం ఇవ్వలేదు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ పది రోజుల క్రితం మళ్లీ నోటీసు పంపించగా, ఆ నోటీసుకు సమాధానం ఇచ్చే గడువు ఆదివారం (23)తో ముగిసింది.
దీంతో దానం నాగేందర్ ఆదివారం స్పీకర్‌ను కలిసి తనకు మరింత గడువు కావాలని కోరాలనుకున్నారు. కాగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉదయమే వికారాబాద్ పర్యటనకు వెళ్ళడంతో, దానం నాగేందర్ స్పీకర్‌కు ఫోన్ చేసి సమాధానం ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరినట్లు సమాచారం. పది మంది ఎంఎల్‌ఏల విచారణ నాలుగు వారాల్లో ముగించాల్సి ఉన్న విషయాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ దానంతో అన్నట్లు తెలిసింది. సోమవారం దానం గడువు కోసం లిఖితపూర్వకంగా స్పీకర్‌కు లేఖ అందించినున్నట్లు ఆయన అనుయాయుల ద్వారా సమాచారం.మరోవైపు ఫిరాయింపు ఎంఎల్‌ఏగా ఆరోపణ ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి కూడా స్పీకర్‌ను గడువు కోరారు. అందుకు స్పీకర్ వారం రోజుల గడువు ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇరువురూ అనర్హత వేటు పడడానికి ముందే తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.




