
హైదరాబాద్: పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యారు. చాలా మంది భక్తులు సత్యసాయి బాబాను తలుచుకుంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా సత్యసాయిని స్మరించుకుంటూ హీరో విజయ్ దేవరకొండ కూడా సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు. నెలల వయసులో తనకు సత్యసాయి ‘విజయ సాయి’ అని నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
‘‘మేం రోజూ మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాం. మీరెప్పటికీ మాతోనే ఉంటారు. మీ నుంచి ఎంతో నేర్చుకున్నాం. ప్రపంచానికి ఏదైనా ఇవ్వగలిగేలా మాలో స్పూర్తి నింపారు’’ అని సత్యసాయి గురించి విజయ్ రాసుకొచ్చారు. అంతేకాక.. చిన్న తనంలో ఆయనతో దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలోనే విజయ్ విద్యాభ్యాసం చేశారు. ‘పుట్టపర్తి సాయి దివ్య కథ’ పేరుతో రూపొందించిన టివి సీరియల్‌లోనూ అతడు నటించారు. ఇక ఈ ఏడాది ‘కింగ్‌డమ్’ అనే సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా అంత సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం అతడు రవికిరణ్ కోలా దర్శకత్వంలో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో కీర్తి సురేశ్ హీరోయిన్.




