
బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల మధ్య ఉన్న తేడాను కెటిఆర్ వివరించారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రతి పైసా ద్వారా ఆస్తులను సృష్టిస్తే ఈ ప్రభుత్వం మాత్రం అప్పుల సునామిని సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ లెక్కల ప్రకారం పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 2.80 లక్షల కోట్ల అప్పులు తీసుకువస్తే, 23 నెలల కాలంలోనే దాదాపు రెండు లక్షల 30 వేల కోట్ల అప్పులను కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని అన్నారు.ఆనాడు మిషన్ భగీరథ, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి మిషన్ కాకతీయ వేలకోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణం వంటి అనేక ఉత్పాదక ఆస్తులను సృష్టించిందని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకం లేకుండానే, ఒక్క ప్రాజెక్టు ప్రారంభం కూడా చేయకుండానే, కనీసం మౌలిక వసతుల కోసం ఒక్క ఇటుక పేర్చకుండానే రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చి ఏం చేసిందని ప్రశ్నించారు.
అక్టోబర్ నెల కోసం విడుదల చేసిన కాగ్ నివేదికతో వడ్డీల వాదనలో డొల్లతనం బయటపడటంతో, ఇంత భారీ మొత్తంలో చేస్తున్న అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోతున్నాయో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. వడ్డీల పేరుతో పదేపదే అబద్ధాలు చెబుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వాస్తవానికి ఈ అప్పులన్నింటినీ తమ అనుచరులు, మధ్యవర్తులు, ఢిల్లీకి మూటలను పంపడానికే ఉపయోగిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ‘స్కాంగ్రెస్ ఎటిఎం’ గా మార్చారని విమర్శించారు. ఇన్ని రోజులు వడ్డీల కోసమే అప్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొచ్చినా, కాగ్ నివేదికతో మరోసారి వాదనలోని డొల్లతనం బట్టబయలైనందున, ఈ అప్పులన్నీ దేని కోసం చేశారో వెంటనే ప్రజలకు వివరించాలని అన్నారు.




