
హైదరాబాద్: తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో అందె శ్రీ సంతాప సభకు ఆయన హాజరయ్యారు. రేవంత్‌తో పాటు పలువురు మంత్రులు, నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతులు అని కితాబిచ్చారు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, ఆధిపత్యాన్ని సహించలేరని అన్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతో మంది కళాకారులు తమ పాటలతో చైతన్యం కలిగించారని మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని.. ఉద్యమానికి కవులు, కళాకారులు ఇచ్చిన ఊపుతోనే తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు.
ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన ‘జయజయహే తెలంగాణ’ పాట రాశారని కొనియాడారు. అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదని పేర్కొన్నారు. కానీ.. తెలంగాణ సాకారమైన తర్వాత ‘జయజయహే తెలంగాణ’ పాట మూగబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకులు అందెశ్రీ గీతంపై కుట్రలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం రాగానే ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామని తెలిపారు. ఇవాళ ప్రతి పుస్తకంలో మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ పాట కనిపిస్తుందని పేర్కొన్నారు. ఉద్యమంలో అందరం పాడిన పాట, ప్రజలు మెచ్చిన పాటనే రాష్ట్ర గీతంగా ప్రకటించామని తెలిపారు.
అందె శ్రీ, గద్దర్ కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణకు చెందిన 9 మంది కవులను, కళాకారులను గౌరవించిన విషయాన్ని గుర్తు చేశారు. 9 మంది కవులు, కళాకారులకు 300 గజాల ఇంటి స్థలం ఇచ్చామని అన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. చదువుల్లోనే కాదు.. విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లోనూ ఎస్సీల ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు. మంత్రి వర్గంలోనూ ఎస్సీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు.




