
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25వ తేదీన సచివాలయంలో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్‌లు, డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్‌లో పెట్టి ఆమోదించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై చర్చించనున్నారు. అదేవిధంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు వారోత్సవాల నిర్వహణపై చర్చించనున్నారు. అదేవిధంగా పత్తి కొనుగోలు, రైజింగ్ తెలంగాణ- 2047 లక్ష్యాలు, గిగ్ వర్కర్స్ బిల్లు, సౌదీ బస్సు ప్రమాదంలో దుర్మరణం చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు తదితర అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నట్లుగా తెలుస్తోంది.




