
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. యుఎఇ అండర్19తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 బంతుల్లోనే శతకం సాధించిన వైభవ్.. ఆ మ్యాచ్‌లో 42 బంతుల్లో 144 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్ అండర్19తో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. ప్రస్తుతానికి రెండు మ్యాచుల్లో కలిపి 189 పరుగులతో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా, మంగళవారం భారత ఏ జట్టు, ఒమన్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా వైభవ్‌ని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఒమన్ ఆటగాళ్లు ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాత్సవ అన్నారు.
‘వైభవ్‌ని కేవలం టివిల్లో చూడటమే.. మరికాసేపట్లో ప్రత్యక్షంగా అతడితో తడపడనున్నాం. మనకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు బంతిని అంత దూరం బాదలేం. కానీ, వైభవ్ మాత్రం అందుకు మినహాయింపు. అతడు అద్భుతంగా, అలవోకగా సిక్సులు బాదుతున్నాడు’ అని ఆర్యన్ బిస్త్ అన్నాడు.
‘అతన్ని కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను క్రికెట్‌పై అతడి దృక్పథం ఏంతో తెలుసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అతడు కేవలం 14 సంవత్సరాల వయసులోనే అంత పెద్ద సిక్సులు కొడుతున్నాడు. నేను అతడిని కలిసి.. మాట్లాడదామని అనుకుంటున్నా’ అని సమయ్ శ్రీవాత్సవ తెలిపాడు.




