
హైదరాబాద్: ప్రముఖ కమెడియన్ జోష్ రవి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గత వారమే ఈ ఘటన జరిగినప్పటికీ.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రవి ఆ తర్వాత జోష్ రవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు తెలుగు చిత్రాల్లో నటించడంతో పాటు.. ‘జబర్దస్త్’ కామెడీ షోలో పలు స్కిట్లు చేసి ప్రేక్షకులను నవ్వించాడు.
అయితే రవి తల్లిదండ్రులు అతడి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో నివసిస్తుంటారు. కార్తీక మాసం మూడో సోమవారం శివాలయంలో అభిషేకం చేయించడానికి వెళ్లి సూర్య వెంకట నరసింహ శర్మ.. ఆలయంలోనే అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గుండెపోటు ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సూర్య వెంకట నరసింహ శర్మకు రవి ఒకడే సంతానం. అందరితో ఎంతో కలిసిమెలిసి ఉండే వ్యక్తి మరణంతో మార్టేరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.




