
టేక్మాల్: సాధారణంగా అవినీతి అధికారులు ఎసిబికి చిక్కితే అంత హడావుడి ఏం కనిపించదు. కానీ, ఈ ఎస్సై ఎసిబికి చిక్కినందుకు గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా పని చేసే ఎస్సై రాజేశ్ ఎసిబి అధికారులకు చిక్కాడు. ఓ కేసు విషయంలో రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా.. అతన్ని ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులను చూసిన రాజేశ్ పొలాల్లోకి పరిగెత్తాడు. దీంతో అతడిని వెంబడించి పట్టుకున్నారు ఎసిబి అధికారులు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి రాజేశ్‌ని విచారిస్తున్నారు. ఎస్సై ఎసిబి అధికారులకు చిక్కడంతో గ్రామస్థులు.. స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.




