
కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 189 పరుగుల చేసి అన్ని వికెట్లు కోల్పోయింది. 30 పరుగుల వెనుకంజలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు భారత ఆల్ రౌండర్ జడేజా చుక్కలు చూపించాడు. తన బౌలింగ్‌తో ప్రత్యర్థిని బెంబేలెత్తించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు వేసిన జడేజా 29 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు. జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్(2 వికెట్లు), అక్షర్ పటేల్(1 వికెట్)లు కూడా మంచిగా బౌలింగ్ చేశారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసి 63 పరుగుల ఆధిక్యంలో ఉంది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో కెప్టెన్ బవుమా (29) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు.




