
హైదరాబాద్: బిహార్ ఫలితాలు భవిష్యత్ లో దేశమంతా వచ్చే ఫలితాలకు నిదర్శనం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బిహార్ లో ఎన్డిఎ ఘన విజయం సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్ లో కాంగ్రెస్ కంటే ఎంఐఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బాగుంటుందని.. అన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయని రామచందర్ రావు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని భావిస్తున్నామని, జూబ్లీహిల్స్ లో బిజెపి ఎప్పుడూ గెలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కాకుండా.. ఎంఐఎం గెలిచినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం దుర్వినియోగం చేసి గెలిచిందని, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచే పోటీ చేశారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఓటమి తర్వాత బిజెపి మంచి విజయాలు సాధించిందని రామచందర్ రావు పేర్కొన్నారు.




