
అమరావతి: కర్నూల్ బస్సు ప్రమాదం రోజు జరిగిన సంఘటన షాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. కర్నూల్ బస్సు ప్రమాదం కంటే ముందు జరిగిన బైక్ ప్రమాద దృశ్యాలు బయటకు వచ్చాయి. ఓ బస్సు సిసి టివిలో రోడ్డు పక్కన శివ చనిపోయి మృతదేహం కనిపించగా అతని పక్కన నిలబడి స్నేహితుడు స్వామి కనిపించాడు. ఆ సమయంలో బైక్ రోడ్డు మధ్యలో పడి ఉండడంతో వాహనాలు మెల్లగా వెళ్లాయి. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. బస్సు డ్రైవర్ మాత్రం మద్యం సేవించలేదు.
బైక్ డ్రైవర్ మద్యం తాగినట్లు నిర్ధారణ
బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నారని పోలీసులు నిర్ధరించారు. ’సిసి వీడియోలో ఆయన వైఖరి మద్యం సేవించినట్టు ఉంది. శవ పరీక్ష లో అదే నిజమని తేలింది’ అని పోలీసులు తెలిపారు. ”ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఆర్ఎఫ్ఎస్ఎల్ ), కర్నూలు తన విశ్లేషణా నివేదికను సమర్పించింది. శవ పరీక్షలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ నివేదిక ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది” అని కర్నూలు ఎస్పి ప్రకటించిన విషయం తెలిసిందే.




