
అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది అని మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. క్రెడిట్ చోరీ ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..18 నెలల కాలంలో గజం స్థలం కూడా సేకరించలేదని, ఒక్కరికి సెంటు స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క పైసా ఖర్చు చేయలేదని, ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని మండిపడ్డారు. వైసిపి హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను.. తామే కట్టేశామంటూ సిగ్గు లేకుండా చెప్తున్నారని, చంద్రబాబు.. చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని జగన్ ధ్వజమెత్తారు. ఇతరుల కష్టాన్ని గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని, నాటకాల రాయుడు అంటారు అని ఎద్దేవా చేశారు. 3.92 లక్షల ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా చంద్రబాబు ఇవ్వలేదని, 3.92 లక్షల ఇళ్లలో 1,40,010 ఇళ్లు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలియజేశారు. 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ వైఎస్ఆర్ సిపి కట్టించినవేనని, 66,845 ఇళ్లు వైఎస్ఆర్ సిపి హయాంలో ఉన్నవేనని పేర్కొన్నారు. అక్టోబర్ 12,2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో గృహప్రవేశాలతో చరిత్ర సృష్టించామని కొనియాడారు. ఇన్ని వాస్తవాలు కళ్లముందే ఉన్నా.. అసలు వైఎస్ఆర్ పి ప్రభుత్వం ఏమి చేయనట్లు చంద్రబాబే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.




