
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో ఓటమి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. బిజెపి, రేవంత్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని, రేవంత్ సర్కార్‌ను బిజెపి కాపాడుతోందని ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డలోని మోతి నగర్ కాలనీ వాసవి బృందావనం అపార్ట్ మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో యూరియా కొరత వస్తే సంజయ్ ఎక్కిడికెళ్లారని ప్రశ్నించారు. కన్నీళ్లను కూడా రాజకీయం చేయడం చిల్లర రాజకీయమని దుయ్యబట్టారు. చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు సహించరని, కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసిన తరువాత అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయిందని, పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు భూమమ్ముదామంటే ధర లేక నష్టపోతున్నారని, రేవంత్ రెడ్డి అసమర్థత పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు.
హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణాలకు ముఖ్యమంత్రి కమీషన్లు డిమాండ్ చేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నదని హరీష్ రావు దుయ్యబట్టారు. రియల్ ఎస్టేట్ పర్మిషన్లకు, నిర్మాణ పర్మిషన్లకు 30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు చేశారు. దివంగత ఎంఎల్ఎ మాగంటి గోపీనాథ్ కాదు మా ఇంటి గోపీనాథ్ గా జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించారని, దురదుష్టవశాతూ ఆయన చనిపోయారని, కుటుంబానికి, వారి పిల్లలకి అండగా బిఆర్ఎస్ పార్టీ నిలిచిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ అని ఘాటు విమర్శలు చేశారు. వాళ్లది రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్ లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండ్ ఓవర్ చేశారని ప్రశ్నించారు. బైండోవర్ చేసిన వాళ్లని రౌడీ అనకపోతే ఏమంటారని హరీష్ రావు అడిగారు.
సునీతమ్మ ఒక్కరు కాదు అని, ఆమె వెంట కెసిఆర్, మొత్తం బిఆర్ఎస్ పార్టీ ఉందని తెలియజేశారు. జూబ్లీహిల్స్ లో సునీతమ్మ గెలుపుతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని, జూబ్లీహిల్స్ లో బిఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకోవాల్సి వస్తుందన్నారు. ఈ రోజు ప్రజలందరూ మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని సరి చేయాలంటే మళ్ళీ ఇంకెంత సమయం పడుతుందని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాదులో బిఆర్ఎస్ ప్రభుత్వం 43 ఫ్లైఓవర్లు నిర్మించిందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క చిన్న రోడ్డు అయినా వేశారా? అని చురకలంటించారు.




