
హైదరాబాద్: ప్రజాపాలన ప్రారంభమై రెండు సంవత్సరాలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామన్నారు. రాష్ట్రం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రజలు బిఆర్ఎస్ ను గెలిపించారన్నారు. మీట్ ది ప్రెస్ లో సిఎం రేవంత్ మాట్లాడారు. జిసిసిలు, డెటా సెంబర్లకు హైదరాబాద్ హబ్‌గా మారిందని, భారత దేశానికి వచ్చిన జిసిసి, డెటా సెంటర్లలో 70 శాతం హైదరాబాద్‌కే వచ్చాయని, దివంగత ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్థన్ రెడ్డి పునాది వేసిన ఐటి రంగం హైదరాబాద్‌లో అభివృద్ధికి ఎంతో కీలకంగా మారిందని గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు. 2004లో ఉచిత కరెంట్ పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని, రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకుందని, కరువు ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి జలయజ్ఞం చేపట్టారని మెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో ఐటి, ఫార్మా రంగాలను గత పాలకులు ఎంతో ప్రోత్సహించారని కొనియాడారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు పడ్డాయని ప్రశంసించారు. గతంలో కాంగ్రెస్ హయాం లోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మార్చి నిధులు కొల్లగొట్టిందని, గతంలో నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉండేవన్నారు.




