
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టి-20ల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం జరగాల్సిన ఐదో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ భారత్‌కు దక్కింది. అయితే ఈ సిరీస్ అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డును ఇచ్చే సాంప్రదాయాన్ని భారత మేనేజ్‌మెంట్ కొనసాగించింది. ఈ మెడల్‌ను టీమ్ ఆపరేషన్స్ మేనేజర్ రహిల్ ఖాతా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కి అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని బిసిసిఐ సోషల్‌మీడియాలో విడుదల చేసింది. ఈ సందర్భంగా సుందర్ మాట్లాడుతూ.. రహిల్‌పై ప్రశంసలు కురిపించాడు.
రహిల్ చేతుల మీదుగా ఈ పతకాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ప్రతి రోజు ఆయన చాలా కష్టపడుతూ.. తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాకు రావడం, తుది జట్టులో చోటు దక్కించుకోవడం, టీమ్ విజయానికి తోడ్పడటం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని తెలిపాడు. ఈ సిరీస్‌లో సుందర్ మూడు మ్యాచ్‌లు ఆడాడు. సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యంలో ఉన్న తరుణంలో, మూడో టి-20లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 49 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నాలుగో మ్యాచ్‌లో 1.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతడు మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.




