
హైదరాబాద్: సిఎం రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలు జరిగాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైడ్రా పేరిట జరుగుతున్న అరాచకాలు ప్రజలు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా సోమాజీగూడాలో ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ..జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. వికాసం- విధ్వంసానికి మధ్య ఎన్నిక జరగబోతుందని తెలియజేశారు. వికాసం గెలవాలా? విధ్వంసం గెలవాలో? ప్రజలు నిర్ణయించుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనకు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని, కాంగ్రెస్ ను ఓడించకపోతే మరో మూడేళ్లు నరకయాతన అనుభవించాలని హెచ్చరించారు. మాజీ సిఎం కెసిఆర్ పాలనలో వికాసం అని.. కొనియాడారు. రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసం అని కెసిఆర్ అందించిన పథకాలు ఒక్కొక్కటీ రద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హయాంలో బ్లాక్ మెయిల్ పాలన జరుగుతోందని, పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి ఎలా బ్లాక్ మెయిల్ చేశారో అందరికీ తెలుసు అని హరీశ్ రావు అన్నారు. కళాశాలలు నడపలేకపోతున్నామని.. యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు దిగాయని, బకాయిలు విడుదల చేయక.. సమ్మె చేయనీయకుండా కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిరవధిక సమ్మెకు దిగిన కళాశాలల్లో విజిలెన్స్ సోదాలు చేస్తున్నారని, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయకపోతే సమ్మె నోటీసు ఇచ్చారని అన్నారు. సమ్మె నోటీసు ఇస్తే ఆస్పత్రులకు నోటీసులు.. మున్సిపల్, విజిలెన్స్ దాడులు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.




