
అహ్మదాబాద్: ప్రియుడితో కలిసి భర్తను చంపి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీసులకు దృశ్యం సినిమాను చూపించింది. 18 నెలల తరువాత నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సర్ఖేజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సమీర్ బిహారీ, రూబీ అనే దంపతులు ఫతేవాడిలో నివసిస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఇమ్రాన్ అనే వ్యక్తితో రూబీ వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తను చంపాలని ప్రియుడితో ప్లాన్ వేసింది. ప్లాన్‌లో భాగంగా భర్త ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆమె ప్రియుడి, ఇద్దరు స్నేహితులతో కలిసి అతడి గొంతుకోసి హత్య చేశారు.
అనంతరం ఇంట్లోనే గోతి తొవ్వి మృతదేహాన్ని పూడ్చేశారు. అనంతరం మృతదేహం పూడ్చిన వద్ద సిమెంట్ వేశారు. తన భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో రూబీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో తన భర్త ముంబయికి వెళ్లాడని దృశ్యం సినిమా చూపించింది. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపారు. భర్త అదృశ్యమై 18 నెలల గడిచిన అతడి ఆచూకీ కనిపించడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఇంటికి ఎవరు వచ్చి వెళ్తున్నారు అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇమ్రానే అనే వ్యక్తితో రూబీ ఇంటికి వస్తున్నాడని విచారణలో తేలడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తానే హత్య చేశానని ఒప్పుకోవడంతో ఇంటికెళ్లి అస్థిపంజరం బయటకు తీసి డిఎన్‌ఎ టెస్టుకు పంపించారు. మృతుడు సమీర్ అని తేలడంతో ప్రియుడి, ప్రియురాలు, మరో ఇద్దరు స్నేహితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.




