
భారత స్వాతంత్య్ర పోరాటంలో సాధారణ భారతీయులను సైతం భావోద్వేగంతో ఉర్రూతలూగించి, స్వతంత్ర సమరం వైపు నడిపించి, విప్లవకారులు నవ్వుతూ ఉరికంభంల వైపు తీసుకెళ్లి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూల్చివేసేందుకు స్ఫూర్తి ఇచ్చిన అసాధారణమైన గేయం ‘వందేమాతరం’. ఇప్పటికి కూడా భాష, ప్రాంతం, మతం, కులం, వర్గం వంటి అన్ని విభేదాలతో సంబంధం లేకుండా భారతీయులు అందరికీ ఉత్తేజం కలిగించే గీతం ఇది. భారత మాతను ఇంతకన్నా ఘనంగా కీర్తించి, సమర్పించుకొనే గేయం మరొకటి లేదని చెప్పవచ్చు. ఇది మన దేశ జాతీయ గేయం. దీన్ని 1875లో నవంబరు 7న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ కూర్చారు. ఆయన రచించిన బెంగాలీ నవల ‘ఆనంద్ మఠ్’లో ఈ గేయాన్ని పొందుపరిచారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవం ఈ ఏడాది నవంబరు 7న మొత్తం దేశ ప్రజలు జరుపుకుంటున్నారు. ఆ రోజున ఒక నిర్ణీత సమయంలో దేశ ప్రజలు అందరూ ఈ గేయాలాపన జరపాలని కేంద్ర ప్రభుత్వం పిలుపిచ్చింది. ఈ వేడుకను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. నాడు, నేడూ కోట్లాదిమంది భారతీయులను ఏకం చేస్తున్న వందేమాతరం పాట స్వాతంత్య్ర సమరయోధుల నినాదం, స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో నిరసనలు, సమావేశాలు, కాంగ్రెస్ సమావేశాల ద్వారా ప్రతిధ్వనించింది. ప్రజలలో అంతులేని ధైర్యం, ఐక్యతలను సూచిస్తుంది.
స్వేచ్ఛ కోసం తహతహలాడే ప్రతి భారతీయ హృదయాన్ని కలుపుతుంది. చరిత్రపుటల్లోకి వెళితే 1769 నుంచి 1773 మధ్యకాలంలో బంగాల్‌లో దారుణమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి బంగాల్ ప్రాంతం భౌగోళికంగా చాలా పెద్ద పరిణామంలో ఉండేది. తూర్పు భారత్‌లోని పలు రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ కూడా అప్పటి బంగాల్‌లోనే భాగంగా ఉండేవి. ప్రత్యేకించి 1770లో కరువుతో బంగాల్ ప్రజానీకం అల్లాడిపోయారు. ఈ పరిస్థితుల్లో దాదాపు కోటి మందికిపైగా చనిపోయారు. ఈ నేపథ్యంలో 1770 నుంచి 1775 వరకు బ్రిటీష్ పాలకులు, భూస్వాములపై హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్లు ఎక్కడికక్కడ తిరుగుబాటు చేశారు. బ్రిటీష్ పాలకులకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆహార గోదాములు, కోశాగారాలు, సంపన్న ఉన్నతాధికారుల ఇళ్లపై తిరుగుబాటుదారులు దాడులు చేశారు.
అక్కడి నుంచి సేకరించిన డబ్బు, ధాన్యాలను పేదలకు పంచారు. ‘ఆనంద్ మఠ్’ నవలను బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ రచించేందుకు హిందూ సన్యాసులు, ముస్లిం ఫకీర్ల తిరుగుబాటు ఉద్యమమే స్ఫూర్తిని ఇచ్చింది. దేశభక్తిని, జాతీయతా వాదాన్ని రగిల్చేలా సాగిన ఆ ఉద్యమ ఘటనల గురించి ‘ఆనంద్ మఠ్’ నవలలో కళ్లకుకట్టేలా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి. బంగాలీ భాషలోని ఈ నవలలోనే వందేమాతర గేయం ఉంది. ‘ఆనంద్ మఠ్’ నవల 1882లో ప్రచురితమైంది. ‘వందేమాతరం’ అంటే ‘మాతృభూమికి నమస్కారం’ అని అర్థం. ‘ఆనంద్ మఠ్’ రచన ద్వారా ఆధునిక భారతీయ నవలా సాహిత్యానికి బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ బలమైన పునాదులు వేశారు. సామాజిక, కుటుంబ, చారిత్రక అంశాలపైనా ఆయన పలు నవలలు రాశారు.
‘ఆనంద్ మఠ్’ లోని వందేమాతర గేయమే బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్‌కు విశేషమైన ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. 1905లో జరిగిన బంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమానికి కూడా వందేమాతర గేయమే స్ఫూర్తిని ఇచ్చింది. అది భారతీయులందరి మదిలో దేశభక్తి భావాన్ని రగిల్చింది. బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ 1838 సంవత్సరం జూన్ 26న కోల్‌కతా సమీపంలోని నహాతీ పట్టణంలో జన్మించారు. ప్రఖ్యాత కోల్‌కతా యూనివర్శిటీ తొలి గ్రాడ్యుయేట్లలో ఆయన కూడా ఒకరు. 1858లో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. లా కోర్సు చేసిన అనంతరం బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్‌కు బ్రిటీష్ ప్రభుత్వంలో డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా ఉద్యోగం వచ్చింది. దాదాపు 30 ఏళ్లపాటు (1891 వరకు) ఆయన ప్రభుత్వ సర్వీసుల్లో కొనసాగారు. అయినప్పటికీ జాతీయతా వాదంతో రచనలు చేయడాన్ని బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ ఆపలేదు. బ్రిటీష్ ప్రభుత్వ సర్వీసులో ఉండగానే వందేమాతర గేయంతో కూడిన ఆనంద్ మఠ్ నవలను రాయడం, ప్రచురించడం జరిగాయి.
మన భారత దేశానికి, యావత్ భారతీయులకు గొప్ప గేయాన్ని అందించి 1894 ఏప్రిల్ 8న బంకిమ్ చంద్ర ఛట్టోపాధ్యాయ్ తుదిశ్వాస విడిచారు. 1950 జనవరి 24 న భారత రాజ్యాంగ సభ ‘వందేమాతరం’ను జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1950లో దీనికి జాతీయ గీత హోదాను ఇచ్చారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో ఇది కీలక పాత్ర పోషించిందని, ‘జన గణ మన’తో సమానంగా దీనిని గౌరవించాలని అప్పట్లో రాజేంద్రప్రసాద్ తెలిపారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్య్రం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్‌ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు. ఏ వాద్య సంగీతమూ లేకుండా అచ్చమైన గాత్రంతో పాడి వినిపించారు. పాట లోని మాధుర్యం, పదాల్లోని భావతీవ్రత సంగీతం మాటున మిగిలిపోకూడదని అలా పాడించారని చెబుతారు. అందుకనే దూరదర్శన్‌లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు. స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటిష్ వారు ‘గాడ్ సేవ్ అవర్ క్వీన్’ ను బ్రిటిష్ ఇండియా జాతీయ గీతంగా ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ‘వందేమాతరం’ అనధికారికంగానే జాతీయ గీతంగా ప్రసిద్ధి చెందింది.
1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని పఠించిన తర్వాత దీనికి ప్రాముఖ్యత లభించింది. మాతృభూమికి ఉత్తేజకరమైన గీతం, ఇది ఇలా ఉంటుంది. వందేమాతరం! సుజలం, సుఫలం, మలయజ శీతలం, సస్యశ్యామలం, మాతరం! వందేమాతరం! బిబిసి వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్‌లో ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం. మొదటిస్థానం ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవ గీతానికి దక్కింది. విప్లవ నాయకుడు అరబిందో ఘోష్ 1909 1910 మధ్య కాలంలో ఈ నవలను ఆంగ్లంలోకి అనువదించారు. ఆయన రాసిన కవితా ఇలా ఉంది, అమ్మా, నేను నీకు నమస్కరిస్తున్నాను! నీ ఉప్పొంగే ప్రవాహాలతో సమృద్ధిగా, నీ పండ్ల తోట మెరుస్తున్న ప్రకాశవంతంగా, ఆనందపు గాలులతో చల్లగా, ఊగుతున్న చీకటి పొలాలతో, శక్తి యొక్క తల్లి, స్వేచ్ఛా తల్లి!
1906లో పాథే ఫోన్స్ కంపెనీ వందేమాతర గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గళంలో గ్రామఫోన్ రికార్డుగా తెచ్చింది! ఆ తర్వాతి సంవత్సరమే ఆ కాపీలన్నింటినీ బ్రిటిష్ పోలీసులు ధ్వంసం చేసేశారు. దానికి సంబంధించిన ఒరిజినల్ ప్రతి చాలా రోజులు పారిస్‌లోనే ఉండిపోయింది. 1966 లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని మళ్లీ కాపీ చేయించి మన దేశానికి తెప్పించారు. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. బెంగాల్ సాయుధ పోరాట దళం నుంచి ఉరిశిక్షకి గురైన తొలి యోధుడు కుదిరామ్ బోస్. బ్రిటిష్ మేజిస్ట్రేట్ కింగ్స్‌ఫోర్డ్ హత్యాయత్నం కేసులో అతను దోషిగా అరెస్టయ్యా డు. 1908, ఆగస్టు 11న ఉరిశిక్ష ఖరారైంది. ఆ సందర్భంగా న్యాయమూర్తి, ‘నువ్వేమైనా చెప్పదలచుకున్నావా?’ అని అడిగాడు.
తల అడ్డంగా ఊపి, ‘వందేమాతరం!’ అంటూ చిరునవ్వుతో ఉరికొయ్య వైపు నడిచాడు కుదిరామ్. అప్పటికి అతని వయసు పద్దెనిమిదేళ్లే! ఆ వీరుడి భౌతికకాయాన్ని తీసుకెళ్తుంటే కోల్‌కతా వీధులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. అందరి నినాదం వందేమాతరం. ‘దేశభక్తి… భారత మాత పట్ల ప్రేమ… ఇది మాటలకు అతీతమైన భావోద్వేగం అయితే, వందేమాతరం అనేది ఆ అమూర్త భావనకు స్పష్టమైన స్వర రూపాన్ని ఇచ్చే పాట. శతాబ్దాల దాస్యం వల్ల బలహీనపడిన భారతదేశంలోకి కొత్త జీవితాన్ని నింపడానికి బంకిం చంద్ర ఛటోపాధ్యాయ్ దీనిని స్వరపరిచారు(రాశారు). వందేమాతరం 19వ శతాబ్దంలో రాయబడి ఉండవచ్చు, కానీ దాని ఆత్మ వేల సంవత్సరాల నాటి భారతదేశపు అమర చైతన్యంతో ముడిపడి ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా, పెరుగుతున్న సామాజిక విభజనల మధ్య, పౌరులు ఈ పాట స్ఫూర్తిని స్వీకరించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే కోరారు. ‘భారతదేశ దేశభక్తి నిఘంటువులో అంతర్భాగంగా, ‘వందేమాతరం’ స్వాతంత్య్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చింది. పత్రికా, సాహిత్యంలో శాశ్వత వారసత్వాన్ని పొందింది’ అని కొనియాడారు.
– చలసాని నరేంద్ర
– 98495 69050




