
బీహార్ రాష్ట్రం కొన్నేళ్లుగా నిరుద్యోగంతో అల్లాడుతుండగా ఎన్నికల జాతరలో నాయకులు, పార్టీలు ఇచ్చిన హామీల జల్లు నిరుద్యోగ యువతకు ఏమాత్రం ఊరట కలిగించడం లేదు. ఈ సమస్యను అంతగా పట్టించుకోని పాలక వర్గాలు, విపక్షాలు మహిళల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి ఆకర్షణీయ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మహిళల ఓట్లు ఎంతవరకు గెలుపును నిర్ణయిస్తుందన్నదే ప్రశ్న. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలోని 21 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అయ్యేలా మొత్తం రూ. 2100 కోట్లు బదిలీ చేశారు. ఇది ప్రతి మహిళా ఓటరుకు రూ. 10 వేలు వంతున ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఆర్థిక సాయం చేయడమే. ఈ పథకాన్ని గత సెప్టెంబర్ నెలాఖరులో ప్రధాని మోడీ ప్రారంభించారు. దీనికి దీటుగా విపక్షం ఆర్‌జెడి తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చేలా ఓటు వేస్తే ఆర్థికంగా బలహీనులైన, వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతి మహిళకు నెలకు రూ. 2500 వంతున ఆర్థికసాయం అందేలా ‘మై బహిన్ మాన్ యోజన’ పథకాన్ని అమలు చేస్తామని హామీ ప్రకటించడం విశేషం.
ఈ రెండు భారీ ప్రకటనలు బీహార్ మహిళలపట్ల తమకున్న అచంచలమైన నిబద్ధతను చాటి చెబుతున్నాయి. కులగతిశీలత, పితృస్వామ్యంతో నిండిన రాష్ట్రంలో స్త్రీలను స్వతంత్రంగా చూసుకోవడం చాలా విడ్డూరంగా ఉంటోంది. ఈ విషయంలో ప్రతి నియోజకవర్గం రెండుగా చీలిపోవడం ఆశ్చర్యం కాదు. 2014 నుంచి మహిళల కేంద్రంగా ఓటు బ్యాంకు కొల్లగొట్టడానికి ప్రత్యేకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగని మహిళల ఓట్లే విజయావకాశాలను నిర్ణయిస్తాయని కాదు. బీహార్‌లోని మహిళలు తమ అభ్యర్థి ఎవరో ఎంచుకుని ఓటేసే స్వతంత్రత కూడా లేదు. నితీశ్ కుమార్ మొదటిసారి 2005 లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మహిళలను ఆకర్షించే పథకాలతో మహిళా కేంద్రీకృత రాజకీయాలనే నడుపుతున్నారు. ఫలితంగానే 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ చరిత్రలో మొట్టమొదటిసారి మహిళా ఓటర్లు పోటెత్తారు. మహిళా ఓటింగ్ 54.5% ఉండగా, పురుషుల ఓటింగ్ 51.1% మాత్రమే ఉంది. ఈ వ్యత్యాసం జాతీయంగా 2019 ఎన్నికల్లో తీరింది. అయితే విచిత్రమే మంటే ఈసారి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) తుది జాబితాలో లేని 47 లక్షల ఓటర్లలో 16 లక్షల మంది మహిళా ఓటర్లే ఉండడం ప్రత్యేకంగా గమనించవలసి ఉంది.
వీరంతా ఇబిసిలు, దళితులే. ఇదిలా ఉండగా 2023 లో బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులాల సర్వే రాజకీయ వైఖరులను శాశ్వతంగా మార్చివేసింది. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులను నిర్ణయించడానికి వాస్తవంగా ఏ పార్టీలకూ ఆయా కుల సముదాయాల కచ్చితమైన సంఖ్యాబలం ఎంతో అవసరం లేదు. కానీ వెల్లడవుతున్న అంశాలను పరిశీలిస్తే కొన్ని అంచనాలు తెరపైకి వస్తున్నాయి. వెనుకబడిన తరగతుల్లో ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఇబిసి) జనాభాలో 36 శాతం ఉండగా, చాలా వెనుకబడిన ఇతర తరగతులు (ఒబిసి)తో కలుపుకుని 60% వరకు ఉన్నారు. ఇందులో ‘పెద్దల’కు తప్పనిసరిగా సర్దుబాటు చేయాల్సిందే. ఇబిసిలను గమనిస్తే ‘మహాఘట్‌బంధన్ (ఎంజిబి)’లోనే వికాస్‌షీల్ ఇన్సాన్ (విఎస్‌ఐపి) కె చెందిన ముకేష్ సహానీ, డిప్యూటీ సిఎం పదవికి తప్పనిసరి అయ్యారు. 2020లో కులాల సర్వేకు ముందు ఆయనకు నిరాకరించినప్పటికీ, తరువాత ఇవ్వక తప్పలేదు. దీన్ని బట్టి, ఇబిసి, ఒబిసి వర్గాల నిర్ణయాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర వహిస్తాయని తెలుస్తోంది.
ఏ ప్రభుత్వం వచ్చినా తమ స్థానాలు తమకు దక్కాలన్న పట్టుదల ఇబిసి, ఒబిసి వర్గాల్లో ప్రముఖంగా కనిపిస్తోంది. ఎన్‌డిఎలో ఇబిసి అభ్యర్థి నితీశ్ కుమార్ తన 2005లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సంక్షేమమే తన ప్రాధాన్యంగా నెగ్గుకు వస్తున్నారు. జెడియు పాప్యులారిటీని ఎన్‌డిఎ గ్రహించవలసి ఉంటుంది. నితీశ్‌పట్ల విధేయత చూపించవలసి ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య తీవ్ర విఘాతంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు. కానీ ఉద్యోగాల ఎంపిక కోసం నిర్వహించే పరీక్షల్లో పేపర్‌లీక్, పరీక్షల అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి, నోటిఫికేషన్లలో జాప్యం ఇవన్నీ యువతను కుంగదీస్తున్నాయి. కీలకమైన ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది. 2024, 2025 సంవత్సర మొదటి భాగంలో ఎగ్జామ్ పేపర్ లీక్ ఫలితంగా పోలీస్, స్టాఫ్ సెలెక్షన్, రెవెన్యూతోపాటు అనేక ప్రభుత్వ విభాగాల్లో రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది.
ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చాలామంది యువ ఉద్యోగార్థుల్లో ఈ రిక్రూట్‌మెంట్‌ల్లో ఆలస్యాలు ప్రభుత్వ నమ్మకద్రోహమన్న నిర్లిప్తతను, నిరసనను మరింతపెంచాయి. తరచుగా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నా అనేక ఉద్యోగాలు, అనధికారికంగా, అస్థిరంగా ఉంటున్నాయి. ది పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్‌లో నిరుద్యోగం రేటు 5% మించి ఉంది. కానీ కార్మిక భాగస్వామ్యం, వాస్తవానికి పనిచేస్తున్న లేదా పనికోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల నిష్పత్తి దేశం మొత్తం మీద అత్యల్పంగా ఉంది. 15 నుంచి 29 ఏళ్ల లోపు ఉన్న యువత వంద మందిలో కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అదే మహిళల్లో ఆ సంఖ్య చాలా చిన్నదిగా ఉంటోంది. నిరుద్యోగ సమస్య గ్రామాల్లో, పట్టణాల్లో యువత కుంగుబాటు పెంపునకు దోహదం చేస్తోంది.




