
విశ్వరూపం చూపిస్తోంది మరోసారి జీవితం
ముచ్చు మొకం మృత్యువంటే భయమే లేదు ఎప్పుడూ
కాలమే రకరకాల రంగులు మార్చి కాటేస్తోంది
ఒకప్పుడు ఇల్లు
అసమ్మతి నుండి శత్రువర్గానికి, శత్రువర్గం నుండి అసమ్మతికి
అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి దాగుడు మూతల దండాకోర్
ఆట ఆడిన పుండాకోర్పోరాటమో, పొర్లాడటమో
ఆటలో ఓడిందే లేదు ఎప్పుడూ
ఇప్పుడు ఇల్లు
హెర్క్యులస్ మోస్తున్న భూగోళమై మహా భారమనిపిస్తుంది
ఇష్టంలేని భాగస్వామిని తన్ని తగలెయ్యలేక
కాపురం కాటిని కలిసి తగలబెట్టలేక, అపురూపంగా కట్టిన బొమ్మరిల్లును
ఆట మధ్యలో చెడిపెయ్యలేక తన్లాడుతున్న
సొంతదా? కిరాయిదా? అని, తింగరి పృచ్ఛకులు కాకండి
ఎవరికైనా ఇల్లంటే జీవితమే కదా..
జీవితమంటే పోరాటమే ఏ కాలమైనా
ఎన్నాళ్ళు నటిస్తాంగెలిచినట్టు రాలిపోయే కాలం దగ్గరయ్యేలోపు..
అన్నీ దులుపుకోవడమే లాభసాటి యాపారం
తెలివైన యవ్వారం
– జ్వలిత




