
కథ: లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక సిన్సియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్. తన పరిధిలో లేకపోయినా అన్యాయాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించే వ్యక్తి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అతన్ని తన తాత (రాజేంద్ర ప్రసాద్) పెంచి పెద్ద చేస్తాడు. రైల్వే పోలీస్‌గా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న లక్ష్మణ్ భేరి, అడవివరం అనే గ్రామానికి బదిలీ అవుతాడు. ఆ ఊరిలో శివుడు (నవీన్ చంద్ర) గంజాయి పండిస్తూ అక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో శివుడు చేసే పనులకు లక్ష్మణ్ భేరి అడ్డుగా నిలుస్తాడు. అసలు శివుడు వెనుక ఉన్నది ఎవరు? వాళ్ళు చేసే అక్రమాలను అడ్డుకోవడానికి లక్ష్మణ్ భేరి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? ఈ మధ్యలో తులసి (శ్రీలీల)తో లక్ష్మణ్ భేరి ప్రేమ కథ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.
కథనం, విశ్లేషణ: ‘సామజవరగమన’తో రచయితగా సత్తా చాటుకుని ‘మాస్ జాతర’తో దర్శకుడిగా మారిన భాను భోగవరపు… రవితేజను పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో చూపించి ఆయన అభిమానులతో పాటు మాస్‌ను అలరించాడు. సినిమాలో హీరో ఎలివేషన్లు, యాక్షన్ సీక్వెన్సులు, కామెడీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. మాస్ జాతర సినిమాలో ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్‌లో చాలా బాగా చేశాడు. కొన్ని చోట్ల వింటేజ్ రవితేజ కనిపిస్తాడు. రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. ఇక హీరోయిన్‌గా నటించిన శ్రీలీల తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను అలరించింది. విలన్ పాత్రలో నవీన్ చంద్ర చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన అజయ్ ఘోష్ మెప్పించాడు. ఈ సినిమాలో తాత పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే సీనియర్ నరేశ్, ప్రవీణ్, వీటీవీ గణేష్, హైపర్ ఆదిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక ఈ సినిమాలో గంజాయి బస్తాలకు సంబంధించిన ట్రాక్.. అలాగే ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు సీన్స్, రవితేజ అసలు నిజాలు కనుక్కునే సీన్స్ బాగున్నాయి. ఇక కథకుడు, దర్శకుడు భాను భోగవరపు తన తొలి సినిమాతోనే రవితేజ ఇమేజ్‌కు సరిపోయే పక్కా మాస్ సినిమా చేశాడు. హీరోయిజం బాగానే పండించాడు. మొత్తానికి ఈ సినిమాతో ప్రేక్షకులకు మాస్ జాతర అందించాడు.




