
నవీ ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం నవీ ముంబై వేదికగా జరిగే రెండో సెమీ ఫైనల్లో ఆతిథ్య టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. లీగ్ దశలో ఆస్ట్రేలియా అసాధారణ ఆటతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇదే క్రమంలో భారత్‌పై విజయం కూడా సాధించింది. సెమీ ఫైనల్లోనూ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని తహతహలాడుతోంది. భారత్‌తో పోల్చితే ఆస్ట్రేలియా చాలా బలంగా ఉందని చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు, బౌలర్లకు జట్టులో కొదవలేదు. దీంతో టీమిండియాకు ఆస్ట్రేలియాతో పోరు సవాల్ వంటిదేనని చెప్పాలి. ఇప్పటికే లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 330 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడు కోలేక పోయిం ది.
భారత్ ఉంచిన క్లిష్టమైన లక్ష్యాన్ని ఆస్ట్రేలియా అలవోకగా ఛేదించింది. కీలక బ్యాటర్లు ఫామ్‌లో ఉండడం కంగారూలకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఈసారి కూడా వీరిపై ఆస్ట్రేలియా భారీ ఆశలు పెట్టుకుంది. కెప్టెన్ అలీసా హీలీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం అనుమానంగా మారింది. అయితే హీలీ లేకున్నా ఆస్ట్రేలియాకు వచ్చే నష్టమేమీ లేదని చెప్పొచ్చు. ఎల్లిస్ పెర్రీ, ఆష్లీన్ గార్డ్‌నర్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ వంటి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక సదర్లాండ్, అలానా కింగ్ వంటి స్టార్ బ్యాటర్లు కూడా ఫామ్‌లో ఉండడం ఆస్ట్రేలియా కు కలిసి వచ్చే అంశంగా తయారైంది. సదర్లాండ్, కింగ్, పోఫీ మోలినెక్స్, గార్డ్‌నర్ బంతితోనూ సత్తా చాటుతున్నారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరోసారి ఫైనల్‌కు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది.
తేలికేం కాదు..
కాగా, వన్డే వరల్డ్‌కప్‌లో అత్యంత నిలకడైన ఆట ను కనబరిచే ఆస్ట్రేలియాను ఓడించి ముందుకు సాగడం టీమిండియాకు శక్తికి మించిన పనిగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లీగ్ దశలో ఆస్ట్రేలియా అసాధారణ ఆటతో చెలరేగి పోతే టీమిండియా వరుస ఓటములతో సతమతమైంది. మెరుగైన రన్‌రేట్ వల్ల భారత్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. ఇలాంటి స్థితిలో బలమైన ఆస్ట్రేలియాతో పోరు సవాల్‌గా తయారైంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. ఫామ్‌లో ఓపెనర్ ప్రతీక రావల్ గాయం వల్ల వరల్డ్‌కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. ఆమె లేని లోటు టీమిండియా బ్యాటింగ్‌పై స్పష్టంగా కనిపిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మరో ఓపెనర్ స్మృతి మంధాన అద్భుత ఫామ్‌లో ఉండడం భారత్‌కు కాస్త కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు.
ఈ మ్యాచ్‌లో కూడా మంధానపైనే భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన మంధాన తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేలవమైన బ్యాటింగ్ జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లో హర్మన్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత హర్మన్‌పై నెలకొంది. జెమీమా రోడ్రిగ్స్, హర్లిన్ డియోల్, దీప్తి శర్మ, రిచా ఘోష్‌లతో భారత్ బ్యాటింగ్ బలంగానే ఉంది. కానీ పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్‌ను తట్టుకుని భారీ స్కోర్లు సాధించడం అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. కానీ కొంత కాలంగా వన్డేల్లో అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్న టీమిండియాను తక్కువ అంచన వేయలేం. తనదైన రోజు ఎంతటి పెద్ద జట్టునైనా ఓడించే సత్తా భారత్‌కు ఉంది. దీంతో సెమీస్ పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.




