
కదం తొక్కిన వాల్వర్ట్..
చెలరేగిన కాప్
గౌహతి: మహిళల వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా టీమ్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి తుది పోరుకు దూసుకెళ్లింది. మహిళలు, పురుషుల విభాగంలో సౌతాఫ్రికా టీమ్ వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే కుప్పకూలింది. మారిజానె కాప్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చింది.
అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన కాప్ 7 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టింది. క్లార్క్ రెండు వికెట్లను తీసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ నాట్ సివర్ (64), అలైస్ కాప్సె (50), వ్యాట్ (34), స్మిత్ (27) మాత్రమే రాణించారు. మిగతా వారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమను కెప్టెన్ లౌరా వాల్వర్ట్ అద్భుత సెంచరీతో ఆదుకుంది. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న లౌరా 143 బంతుల్లోనే 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 169 పరుగులు చేసింది. మిగతా వారిలో ఓపెనర్ బ్రిట్స్ (45), కాప్ (42), ట్రియన్ (33) పరుగులు సాధించారు.




