
మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా, మొంథా తుఫాన్‌గా మారడంతో రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో 5 సె.మీ నుంచి 20 సెం.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో బుధవారం రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని,
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. దీంతో పాటు రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఎల్లో హెచ్చరిలు జారీ చేసింది. కాగా, గడిచిన 24 గంటల్లో ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండతో పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ నివేదిక వెల్లడించింది.
ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్దం చేశాం : బండి సంజయ్
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో : మొంథా తుఫాన్ నేపథ్యంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రాష్ట్రంలో పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్దం చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 జిల్లాలు భారీ వర్ష ప్రభావం ఉన్నందున అవసరమయిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే పంపించామని పేర్కొన్నారు. తుఫాను ఎదుర్కోవడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.




