
అమరావతి: మొంథా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఒంగోలు దగ్గరలో యరజర్ల – వెంగముక్కల పాలెం మధ్య వాగులో కారు కొట్టుకుపోయింది. స్థానికులు డ్రైవర్ ను కిందకు దిగాలని సూచించారు. కానీ అతడు వినకపోవడంతో వరదలో కారు కొట్టుకపోయింది. అంతర్వేదిపాలెం వద్ద మొంథా తుఫాన్ తీరాన్ని తాకింది. మచిలీపట్నానికి 20 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. అంతర్వేది వద్ద అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. లైట్‌హౌస్ కట్టడాలను సముద్రపు అలలు తాకుతున్నాయి. తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. యానాంలోని కనకలపేట, గెస్ట్‌హౌస్, పాతకోర్టు భవనం, ఎస్‌ఆర్‌కే కళాశాల వద్ద చెట్లు కూలాయి. అయితే సిబ్బంది ఎప్పటికప్పుడు నేలకూలిన చెట్లను తొలగిస్తున్నారు. సహాయ కార్యక్రమాల్లో అగ్నిమాపక, విద్యుత్, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉభయగోదావరి జిల్లాల్లో గాలుల తీవ్రత కొనసాగుతోంది. తీవ్ర గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కృష్ణా జిల్లాలోనూ గాలుల తీవ్రత కొనసాగుతోంది. కృష్ణా జిల్లా దివిసీమలో భారీ వృక్షాలు నేలకూలాయి. తీవ్ర గాలులకు వరి, అరటి, బొప్పాయి పంటలు నెలకొరిగాయి. విశాఖలో కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కలెక్టర్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ హెచ్చరించారు. బాపట్ల జిల్లాలోని వాడరేవులో సముద్రం ఉద్ధృతంగా మారి రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. అలల తాకిడికి కొంత భాగం కోతకు గురై సముద్రం ముందుకువచ్చింది. తుపాను ప్రభావంపై ఇప్పటి వరకు 3.6 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలంతా బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది.




