
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఫోరెన్సిక్ విద్యార్థిని ఘాతుకం
మాజీ బాయ్ ఫ్రెండ్, మరొకరి స్నేహితుడి సాయంతో కుట్ర
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని గాంధీ విహార్ లో అపార్ట్ మెంట్ లో ఈనెల ప్రారంభంలో కాలిపోయి, చనిపోయిన 32 ఏళ్ల యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతడు యూపిఎస్ సీ పరీక్షలకు చదువుకుంటున్న రామ్ కేశ్ మీనాగా గుర్తించారు. అతడి మరణం ప్రమాదం కాదని, హత్య అని, అతడితో సహజీవనం చేస్తున్న అమృత చౌహాన్ అనే 21 ఏళ్ల ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థిని, ఆమె మాజీ ప్రియుడు, సుమిత్ కశ్యప్, మరో స్నేహితుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడిందని దర్యాప్తులో వెల్లడైంది. వీరంతా ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నివాసులు. ఈ కేసు మొదట అగ్నిప్రమాదంగా కన్పించింది. కానీ, ప్రతీకారం కోసం కుట్ర పన్ని చేసిన హత్యగా వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 6న న్యూఢిల్లీలోని తిమార్ పూర్ ప్రాంతంలో ఓ అపార్ట్ మెంట్ లో పేలుడు సంభవించినట్లు పోలీసులకు సమాచారం అందింది.
పోలీసులు వెళ్లి చూడగా, నాల్గో అంతస్తులోని గదిలో 32 ఏళ్ల యువకుడి మృతదేహం కాలిపోయి కన్పించింది. అతడిని రామ్ కేశ్ మీనా గా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టారు. అక్టోబర్ 6 నాటి సిసిటివి ఫుటేజ్ పరిశీలించగా, ఆ రాత్రి మాస్క్ ధరించిన ఇద్దరు యువకులు ఆ అపార్ట్ మెంట్ కు వెళ్లినట్లు, కొంత సేపు తర్వాత వారు, వారి వెంట ఓ యువతి తిరిగి వెళ్లిపోయినట్లు గుర్తించారు. వారు వెళ్లిన కొద్ది సేపటికే ఆపార్ట్ మెంట్ లో పేలుడు జరిగింది. ఆ యువతిని 21 ఏళ్ల అమృత చౌహాన్ గా గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి.
అమృత చౌహాన్, రామ్ కేశ్ మీనాతో కొద్దికాలంగా సహజీవనంలో ఉంది. వారిద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు రామ్ కేశ్ అమృత ప్రైవేటు వీడియోలని చిత్రీకరించి హార్ట్ డిస్క్ లో స్టోర్ చేశాడు. దానిని తొలగించే విషయంలోనే ఇద్దరికీ ఘర్షణ జరిగింది. ఆ వీడియోలు డిలీట్ చేసేందుకు రామ్ కేశ్ ఒప్పుకోకపోవడంతో అమృత కక్ష పెంచుకుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్, మరో వ్యక్తి సాయంతో రామ్ కేశ్ ను చంపేందుకు కుట్రపన్నింది.
అక్టోబర్ 5 రాత్రి నిందితురాలు, మరో ఇద్దరు కలిసి రామ్ కేశ్ ను గొంతు నులిమి చంపివేశారు. తర్వాత మృతదేహం పై ఆల్కాహాల్, నెయ్యి, నూనె వంటివి జల్లారు. వంట గ్యాస్ సిలెండర్ ను తీసుకువచ్చి పైప్ కట్ చేసి, మృతదేహం పక్క ఉంచారు. తర్వాత మృతదేహానికి నిప్పుపెట్టి. మెయిన్ డోర్ వేసి పరారయ్యారని దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు, సాధారణ ప్రమాదంతో పోలిస్తే, మృతదేహం తగులపడిన తీరు భిన్నంగా ఉండడంతో పోలీసులు దర్యాప్తు చేయగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.




