
నలుగురిలో చివరి ఇద్దరిని విక్రయించిన గిరిజన దంపతులు
తిరుమలగిరి(సాగర్) మండలం ఎల్లాపురం తండాలో ఘటన
చెల్లిని అమ్మొద్దని ప్రాధేయపడ్డ అక్క, అమ్మకానికి అడ్డుపడ్డ పెద్ద నాన్న
గుట్టుచప్పుడు కాకుండా అమ్మమ్మ ఊరులోని ఓ గుడి వద్ద విక్రయం
మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి(సాగర్) మండలం, ఎల్లాపురంతండాలో ఇద్దరు ఆడపిల్లలను విక్రయించిన సంఘటన సంచలనం సృష్టించింది. హాలియా టు గుంటూరు అన్నట్టుగా శిశువిక్రయ ముఠా పిల్లలను కొనుగోలు చేసి అమ్మకాలు సాగిస్తోంది. మూడులక్ష ల రూపాయలకే ఆడపిల్లను అంగట్లో సరుకులా కొనుగోలు చేసి గుం టూరు తరలించారు. చెల్లిని అమ్మవద్దు అని అక్క కన్నీరు పెట్టి అడ్డుకోవడం.. తమ్ముడు చేసే తప్పు చూడలేక అన్న చలించిపోయి అడ్డగించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా పేగుబంధాన్ని తెంచుకొని తల్లిదండ్రులు వ్యవహరించిన తీరు అందరినీ కలచివేసింది.
అమ్మకానికి మూడు, నాలుగో సంతానం..
తిరుమలగిరి(సాగర్) మండలంలోని ఎల్లాపురంతండాకు చెందిన గిరిజన దంపతులు కుర్ర పార్వతి,బాబు. వీరికి నలుగురు సంతానం. అందరూ ఆడపిల్లలే. నిరుపేద కుటుంబం కావడంతో పిల్లలను సాకలేక అమ్మకానికి పెట్టారు. మూడో సంతానం ఆడపిల్లను గుట్టుచప్పుడు కాకుండా గుంటూరు శిశువిక్రయ ముఠా దళారులకు అమ్మేశారు. ఆతర్వాత నాలుగో సంతానం కూడా భారంగా మారిందనే భావనతో పేగుబంధాన్ని తెగనమ్ముకున్నారు. నవమాసాలు మోసి కనిపెంచిన ఆడపిల్లను మూడు లక్షలకు అమ్మేశారు. అయితే కుర్ర బాబు అన్న సురేష్ పిల్లలను అమ్మడాన్ని అడ్డుకున్నా ఫలితం లేకుండా పోయింది. పిల్లల అమ్మమ్మ ఊరు పెద్దవూర మండలంలోని పొట్టిచెల్మ ఊరబావితండా వద్ద ఓ గుడిలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయం సాగించారు. ఈసంఘటనతో మరోసారి గిరిజనతండాల్లో శిశువిక్రయాలు బట్టబయలయ్యాయి.
చెల్లిని అమ్మొద్దు అమ్మా..
అల్లారుముద్దుగా పెంచుకున్న నాలుగేళ్ళ నా చెల్లిని అమ్మొద్దు అమ్మా.. అంటూ అక్క ప్రాధేయపడింది. నవమాసాలు మోసి కన్న తల్లి.. అల్లారుముద్దుగా పెంచుకున్న తండ్రి కాళ్ళపై పడి వేడుకుంది. చెల్లిని అమ్మొద్దు అమ్మా అంటూ వేడుకోవడం అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఆడపిల్ల అనే వివక్ష.. పేదరికమే కారణమని అంటున్నారు.
విక్రయ ముఠాకు గిరిజనులే టార్గెట్..
శిశువిక్రయ ముఠా గిరిజనులు, గిరిజన ప్రాంతాలే టార్గెట్‌గా చేసుకున్నారు. దేవరకొండ, హాలియా టు గుంటూరు అన్నట్టుగా దళారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ గిరిజన శిశువులపై కన్నేశారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న తండాలు, కుటుంబాలపై నిఘా ఉంచి వారికి ఆర్థిక అవసరాలు తీరుస్తూ దళారులు దందా సాగిస్తున్నారు. ఎల్లాపురంతండా ఘటనతో మరోసారి శిశువిక్రయాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు ప్రాంతంలో పిల్లలు లేని బడాభూస్వాములు, వ్యాపారవేత్తలు కొందరు దళారులను పట్టుకొని పిల్లలను దత్తత తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇదే అదునుగా తీసుకున్న దళారీ ముఠా గిరిజన ప్రాంతాలపై కన్నేసి అక్కడ ఆడపిల్లలను కొనుగోలు చేసి వారికి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులను క్యాష్ చేసుకొని వారిని వలలో వేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం వెలుగుచూడంటంతో అధికార యంత్రాంగం కదిలింది. ఎల్లాపురంతండాలోని వారి నివాసానికి పరుగులు తీశారు. కానీ ఆకుటుంబం అక్కడ నుండి వెళ్ళి నల్లగొండలో ఉంటూ విక్రయాలు సాగించినట్లు చెపుతున్నారు. అదికూడా మారుమూల తండాల ఊరుబయట దళారులు, విక్రయం చేసి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి అమ్మకం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయి నిఘా వేసిందని చెప్పవచ్చు.




