
కోర్టు కేసుల్లో ఉన్న వాటికి సైతం రిజిస్ట్రేషన్లు
అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ వివిధశాఖల అధికారుల
అవినీతిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు
మనతెలంగాణ/హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ స్థలాలపై కొందరు దొడ్డిదారిన హక్కులు పొందుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. పలు ప్రాంతాల్లో వివాదాస్పదంగా ఉన్న భూముల సర్వేనెంబర్‌లకు బై నంబర్లను వేసి ఆ భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారని, దీంతోపాటు మరికొన్ని ప్రాంత్లాలో సర్వే నెంబర్లు వేయకుండానే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమార్కులకు సహకరించడంలో రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ముందువరుసలో ఉన్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.
నకిలీ పత్రాలను జోడించి
2020 ధరణి అమల్లోకి వచ్చినప్పటి నుంచి తహసీల్దార్‌లు వ్యవసాయ భూములను, సబ్ రిజిస్ట్రార్‌లు నాన్ అగ్రికల్చర్ భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అయితే, ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు వ్యవసాయ భూములకు నాలా కన్వర్షన్ లేకుండా సబ్ రిజిస్ట్రార్ దగ్గర సర్వే నెంబర్‌లకు బై నెంబర్‌లు వేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని, దీంతోపాటు కోర్టు కేసుల్లో ఉన్న భూములను ప్లాట్లుగా చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మరికొన్ని కోర్టు కేసులకు సంబంధించి నకిలీ పత్రాలను జోడించి ఆయా భూములను అక్రమార్కులు స్వాహా చేస్తున్నట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు ఏకంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయాలని సబ్ రిజిస్ట్రార్‌లపై ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలిసింది.
భారీగా డబ్బు ఆశచూపి
అయితే, కొందరు సబ్ రిజిస్ట్రార్‌లకు, తహసీల్దార్‌లకు భారీగా డబ్బు ఆశచూపి ఆయా భూములను అక్రమార్కులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, కొన్ని ప్లాట్లలో ఎలాంటి నిర్మాణాలు లేకున్నా వాటికి ఇంటి నెంబర్‌లను కేటాయించి రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆబాదీ, గ్రామకంఠం భూముల్లో ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్‌ల కోసం మండలాల ఎంపిఓలు, పంచాయతీ కార్యదర్శులు ఎన్‌ఓసీలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో దానిని అధికారులు తమకు అనుకూలంగా మలుచుకొని డబ్బులు ముట్టచెబితేనే ఎన్‌ఓసి ఇస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం విశేషం. సర్వే నంబర్ లేకపోయినా చాలా ఏళ్లుగా నివాసముంటున్న వారి భూమి మోఖాపై విచారణ చేసి ఎన్‌ఓసిలు ఇవ్వాల్సి ఉన్నా, ఆ దిశగా అధికారులు చర్యలకు పూనుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని 31,093 సర్వే నంబర్లలో గ్రామకంఠం, ఆబాదీ భూములు
రాష్ట్రంలోని వేల గ్రామాల్లో భూ సంబంధిత సమస్యలతో ఇళ్లకు పర్మిషన్లు, ఇంటి నంబర్లు రాక యజమానులు తీవ్ర అవస్థ పడుతున్నారు. తెలంగాణలో 31,093 సర్వే నంబర్లలో గ్రామ కంఠం, ఆబాదీ భూములు ఉన్నాయి. గ్రామాల నిర్మాణాలకు కేటాయించిన భూములను ఈ పేర్లతో రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. కొన్నిచోట్ల వాటికి ఆనుకొని ఉండే ప్రభుత్వ స్థలాలను ప్లాట్లుగా మార్చి ప్రభుత్వం గతంలో పేదలకు పంపిణీ చేసింది. ఇవన్నీ పంచాయతీ, మున్సిపాలిటీ సంస్థల దస్త్రాల్లో నమోదై కావడంతో స్థానికంగా నివాసం ఉండే వారికి రిజిస్ట్రేషన్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి.
అనుమతులు లేని అంతస్థులకు…..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసే ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ ఓ మంత్రి పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం. ఇక వనస్థలిపురం ఇన్‌చార్జీగా ఉన్న ఓ సబ్ రిజిస్ట్రార్ ఈ మధ్య పార్కు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి భారీగా వసూళ్లకు పాల్పడినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మూసాపేట, ఇబ్రహీంపట్నం, ఆజంపురా, కుత్భుల్లాపూర్‌లో సబ్ రిజిస్ట్రార్ 3గా పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్‌పై, గోల్కొండ, బీబీనగర్, భువనగిరి, హయత్‌నగర్, యాదగిరిగుట్ట, పెద్ద అంబర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. అపార్ట్‌మెంట్‌లలో అనుమతి లేని అంతస్థులకు రిజిస్ట్రేషన్ చేయవద్దని ఆదేశాలు ఉన్నా వాటిని సబ్ రిజిస్ట్రార్‌లు పట్టించుకోవడం లేదని, బై నెంబర్‌లతో అధికంగా రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.
తనిఖీలు చేపట్టని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో గ్రేటర్ పరిధిలో పనిచేసే ఒక జిల్లా అధికారికి ప్రస్తుతం అదనపు బాధ్యతలను సైతం అప్పగించడంతో ఆయన తన పరిధిలోని సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు సిఎంఓలో ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండడంతో ఆయన చెప్పిందే వేదంగా ఆ శాఖలో జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ అధికారి ఒక జూనియర్ అసిస్టెంట్ దగ్గర డిప్యూటేషన్ కోసం డబ్బులు తీసుకొని ఇప్పటివరకు ఆ పని చేయలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ అసిస్టెంట్ దగ్గరే డబ్బులు తీసుకున్న ఆ జిల్లా అధికారి సబ్ రిజిస్ట్రార్‌ల నుంచి ఏ విధంగా వసూళ్లు చేస్తున్నారన్న విషయమై విచారణ జరపాలని ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ శాఖ ఐజికి సమయం దొరక్కపోవడంతో పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదని, దీంతో సబ్ రిజిస్ట్రార్‌లు అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.




